కాటేసిన కరెంట్
Published Sat, Jul 30 2016 10:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
– విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
– స్తంభంపై తీగను సరి చేస్తుండగా ప్రమాదం
కోసిగి:
కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తిని కరెంట్ కాటేసింది. కోసిగిలోని సిద్దప్ప పాళెం కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న కుమ్మరి ఈరన్న (36) అనే వ్యవసాయ కూలీ శనివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈరన్నది రోజు కూలీ పనులకు వెళ్లితే కానీ పూటగడువని పరిస్థితి. శనివారం వేకువ జామున కోసిగికు చెందిన ఆరకంటి తిక్కన్న అనే రైతు పొలంలో ఉల్లినాట్లు వేయడానికి కూలీకి వెళ్లాడు. అయితే పొలానికి నీళ్లు కట్టేందుకు విద్యుత్ మోటార్‌కు విద్యుత్ సరఫరా రావడం లేదని రైతు కుమారుడు తాయన్న చెప్పాడు. స్తంభం దగ్గర లూజ్ కనెక్షన్ ఉందని దాన్ని సరిచేస్తానని ఈరన్న స్తంభం ఎక్కాడు. అంతకు ముందు పెండేకల్లు ఫీడర్‌కు ఉదయం 6గంటల నుంచి 10గంట వరకు వ్యసాయానికి విద్యుత్ సరఫరా వస్తోంది. విద్యుత్ సరఫరా రాకుండా ఆ లైన్ ఆఫ్ చేసుకుని ఎక్కాడు. అయితే అదే స్తంభానికి దేవబెట్ట ఫీడర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ విషయం తెలిక పోవడంతో స్తంభం ఎక్కిన ఈరన్న విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం స్తంభంపై వేలాడటంతో అక్కడికి చేరుకున్న వారిని కలిచివేసింది. విద్యుత్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి తల్లిదండ్రులు కుమ్మరి తిమ్మప్ప, బజారమ్మ, ఐదుగురు అక్కాచెల్లెల్లు, భార్య నాగేంద్రమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఇంతియాజ్ బాషా పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement