గొల్లప్రోలులో సైబర్ నేరం
గొల్లప్రోలు :
సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి వివరాలు సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు కాజేస్తున్నారనడానికి తాజా ఉదాహరణ గొల్లప్రోలులో గురువారం జరిగింది. స్థానిక రైల్వేస్టేన్ రోడ్డుకు చెందిన కొంతం రేవతికి స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. విదేశాల్లో ఉంటున్న ఆమె కుమారుడు తల్లి పోషణార్థం ఆమె ఎకౌంట్‌లో జమ చేస్తుంటాడు. ఆమెకు గురువారం ఉదయం 72829 24564 ఫోన్ నెంబరు నుంచి ఆధార్‌కార్డు వివరాలు కావాలని ఫోన్ వచ్చింది. దాంతో ఆమె ఆధార్‌కార్డు వివరాలను తెలిపింది. తరువాత అదే ఫోన్ నుంచి మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యింది అని చెప్పి కార్డుపై ఉన్న నెంబర్లు, పిన్ నెంబర్ల వివరాలను ఆమె నుంచి సేకరించారు. ఇంతలో ఆమె ఫోన్‌కు రూ. 5 వేలు ఏటీఎం నుంచి డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆమె ఈవిషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పడానికి వెళ్లే లోపు రూ. 9,500 ఏటీఎం పోస్ నుంచి డ్రాచేసినట్టు మళ్లీ మెసేజ్ వచ్చింది. దాంతో బ్యాంకు అధికారులు ఆమె ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. ఆమె ఖాతాలో రూ. 30వేలు ఉండగా సైబర్‌నేరగాళ్లు చాకచక్యంగా రూ. 14,500 కాజేశారు. బాధితురాలు రేవతి దీనిపై గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.