
రాజ్యాధికారంతోనే దళితుల అభ్యున్నతి
కర్నూలు(అర్బన్): జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి రాజ్యాధికారం సాధనతోనే సాధ్యమని ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్ అన్నారు. స్థానిక సీ క్యాంప్‌లోని డ్రై వర్స్ అసోసియేషన్ సమావేశ భవనంలో సోమవారం ‘రాజ్యాధికారం దళితుల తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో 70 లక్షల మంది మాలలున్నారని, రాజ్యాధికారమే ప్రధాన అజెండాగా 2019 ఎన్నికల్లో ఎస్‌సీ,ఎస్‌టీలను కలుపుకొని ‘మా ఓటు మాకే’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దళితుల అభివద్ధికి సంబంధించి ప్రభుత్వాలు మాటలు చెబుతున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. అతి తక్కువ జనాభా కలిగిన అగ్ర కులాలు ఏళ్ల తరబడి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు యాట ఓబులేసు, జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీను, రిటైర్డు డీఎస్‌పీ జయచంద్ర, సీనియర్ దళిత నాయకులు దేవదాసు, కుంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.