సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై సందిగ్థత ఏర్పడింది. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతూ ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికను పూర్తిచేయాల్సి వుంది. కానీ, కరోనా పేరుతో వాటన్నింటినీ వాయిదా వేశారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే అయినా ఏపీ అధ్యక్షుడి ఎంపికపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావును తప్పించాలని గతంలోనే నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఆ పదవికి సరిపోడనే అభిప్రాయం వచ్చింది. దీనికితోడు ఆయన ఓటమిపాలవడం, ఓడిపోయిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు 63.49 శాతం)
అచ్చెన్నాయుడుపై పునరాలోచన
ఈ నేపథ్యంలో.. అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేశారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ మార్పు చేయకుండా కొద్దిరోజుల తర్వాత చేద్దామని ఆగారు. గత వారం జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. అన్ని కమిటీల నియామకాన్ని వాయిదా వేశారు. బీసీలు పార్టీకి దూరమయ్యారనే ఉద్దేశంతో ఆ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి అవకాశమిస్తే బాగుంటుందని మొదట్లో చూసినా ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కళా వెంకట్రావులా కాకుండా దూకుడుగా ఉంటాడని, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోననే అభిప్రాయం అగ్రనాయకత్వంలో ఏర్పడినట్లు తెలిసింది. బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చాక ఆయన బలపడితే భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. (డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు)
Comments
Please login to add a commentAdd a comment