
దళితులను కించపరిస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం
► మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై దళితులు ఆగ్రహం
► మంత్రినిబర్తరఫ్‌చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్
► అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు
కైకలూరు : దళిత జాతిని అవమానిస్తూ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ౖకైకలూరు నియోజకవర్గంలో దళితులు భగ్గుమన్నారు. దళితులను కించపరిస్తే ఉప్పెనలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కైకలూరులోని తాలూకా సెంటర్ వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేరుగు విక్టర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విక్టర్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నారాయణరెడ్డిని భర్తరఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాధు కొండయ్య మాట్లాడుతూ దళితులను దగా చేస్తున్న నాయకులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబును దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు వ్యతిరేకించాలన్నారు. జిల్లా సేవాదళ్ కార్యదర్శి సోమల శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి, టీడీపీలో చేరిన మంత్రి నారాయణరెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వైఎస్సార్ సీసీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దండే రవిప్రకాష్, నాయకులు ఈదా పండుబాబు, కోనాల జయరాజు, పిల్లనగ్రోవి రఫయేలు, మద్దా ఏసురత్నం, వరిగంజి రాజారత్నం, ఎరిచర్ల శేఖర్‌బాబు, మేరుగు తంబిరాజు, అందుగుల శేషగిరి రావు కొరపాటి పరుశురాముడు పాల్గొన్నారు.
దళిత సత్తా ఏంటో చూపిస్తాం..
మంత్రి నారాయణరెడ్డికి దళిత సత్తా ఏంటో చూపిస్తామని కలిదిండి మండల వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శావా రాజ్‌కుమార్ (దాసు) అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కలిదిండి సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం జరి గింది. దళితులను అవమానించి ఆది నారాయణరెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చే యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ యూత్ నాయకుడు అబ్రహం లింకన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులకు ఎటువంటి గౌరవముందో ఈ సంఘటన రుజువు చేస్తోందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వరరావు, నాయకులు పంతగాని విజయ్‌బాబు, కందుల వెంకటేశ్వరరావు, యాళ్ల జీవరత్నం, యలవర్తి శ్రీనివాసరావు, నేతల మెకాయేలు, బొడ్డు దావీదు పాల్గొన్నారు.
టీడీపీకి ఎస్సీల చేతిలో పరాభవం తప్పదు
ముదినేపల్లి రూరల్ : టీడీపీ నేతలు, మంత్రులకు భవిష్యత్‌లో ఎస్సీల చేతిలో రాజకీయ పరాభవం తప్పదని వైఎస్సార్ సీపీ ఎస్సీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎస్సీలను కించపరుస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక బస్టాండ్ ఎదురుగా అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు మాట్లాడుతూ ఎస్సీలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రులు, నేతలు అదేబాటన నడుస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన కారంచేడు ఘటనకు కారణమైన టీడీపీని తదుపరి ఎన్నికల్లో ఎస్సీలు శంకరగిరి మాన్యాలు పట్టిం చారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చరిత్ర పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల నిరసనోద్యమాలు వెల్లువెత్తుతా యని హెచ్చరించారు. పార్టీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు, చేవూరు సర్పంచి బల్లవరపు హరిబాబు, నేతలు గొరుముచ్చు సామియేలు,నేతల రాజేష్,సాలెం అబ్రహం, అబ్దుల్ జానీ పాల్గొన్నారు.