భీమవరంలో ఉద్రిక్తత
►గరగపర్రు రోడ్డు ప్రమాద బాధితుడి మృతదేహానికి పోస్టుమార్టం
►ఎఫ్‌ఐఆర్‌లో సెక‌్షన్లు మార్చాలంటూ దళిత సంఘాల డిమాండ్
భీమవరం టౌన్: ఒక వైపు దళిత సంఘాల నేతలు.. మరోవైపు పోలీసుల మోహరింపుతో భీమవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గరగపర్రు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు శవపంచనామా రాసే విషయంలో దళిత సంఘాల నేతలు సూచనలు చేయడం, అందుకు పోలీస్ అధికారులు ఆలోచించడం ఇలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఎడతెగని చర్చలు సాగాయి. మరోవైపు యాకోబు మృతి రోడ్డు ప్రమాదంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
అట్రాసిటీ యాక్ట్ సెక‌్షన్ 302ను ఎఫ్‌ఐఆర్‌లో అల్టర్ చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, అడిషనల్ ఎస్పీ వి.రత్న, డీఎస్పీలు జి.పూర్ణచంద్రరావు, సత్యానంద్‌తో వైఎస్సార్ సీపీ నాయకుడు, దళిత సంఘం నేత కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యదేవర వరప్రసాద్, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, సీపీఎం నాయకుడు జేఎన్‌వీ గోపాలన్ తదితరులు చర్చలు జరిపారు. అయితే బయట ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలు మాత్రం తక్షణం ఎఫ్‌ఐఆర్‌లో 302 సెక‌్షన్‌ను అలర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని గరగపర్రు పంపించేందుకు 108 అంబులెన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి వద్దకు వచ్చిన అంబులెన్స్‌ను తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. అడిషనల్ ఎస్పీ రత్న ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశామని నచ్చచెప్పారు. మృతుని కుటుంబీకులు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంతేటి ఆదాము నుంచి కూడా వివరాలు సేకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు కోరికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని దర్యాప్తు అధికారి కేసు దర్యాప్తు చేస్తారన్నారు. దళితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య యాకోబు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఊరేగింపుగా పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు శవపేటికను ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచి గరగపర్రుకు ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యానంద్, సీఐలు, ఎస్సైలు, పోలీసులు స్పెషల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహించారు.
బాధితులకు సర్రాజు పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పరామర్శించారు. చికిత్స పొందుతున్న కంతేటి ఆదామును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడికి వచ్చిన గరగపర్రు దళితులకు మనోధైర్యం కల్పిస్తూ ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, పోలీస్ అధికారులతో సర్రాజు మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కూడా ఆస్పత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు.
దళిత, మానవహక్కుల వేదిక నాయకుల రాక
ఉభయ తెలుగు రాష్ట్రాల మానవహక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.సుధ, సభ్యులు భీమవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. గరగపర్రు ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా విభాగం అధ్యక్షరాలు గొట్టిపాటి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో దళితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ
గరగపర్రు రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావును ఆదివారం మధ్యాహ్నం నుంచి నియమించారు. తొలుత పాలకొల్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్‌ను నియమించినా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న దృష్ట్యా ఆ స్థానంలో వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు నియమించారు.