దళారుల దందా
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ముగ్గురు దళారుల ముందు నిబంధనలు హుష్‌కాకి అవుతున్నాయి. లైసెన్సులు, వాహనాల రిజిసే్ట్రషన్ల కోసం వచ్చిన వారు ఆ ముగ్గురిని సంప్రదిస్తే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. క్యాష్ లెస్ సేవలంటూ ఆ శాఖ అధికారులు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఏ పనికైనా దళారులు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే.
-
వారి ముందు నిబంధనలు బేఖాతర్
-
సిబ్బంది, అధికారులతో మమేకం
-
పాలు, నీళ్లలా కలిసిన అవినీతి బంధం
-
క్యాష్ లెస్ సేవలకు విఘాతం
సాక్షి, హన్మకొండ : జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ముగ్గురు దళారుల ముందు నిబంధనలు హుష్‌కాకి అవుతున్నాయి. లైసెన్సులు, వాహనాల రిజిసే్ట్రషన్ల కోసం వచ్చిన వారు ఆ ముగ్గురిని సంప్రదిస్తే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. క్యాష్ లెస్ సేవలంటూ ఆ శాఖ అధికారులు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఏ పనికైనా దళారులు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వారే రాజులుగా చెలామణి అవుతున్నారు. ఆ శాఖ సిబ్బందిని తలదన్నే రీతిలో పనులు చక్కబెడుతున్నారు.
నిర్భయంగా వ్యవహారాలు..
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దళారులు చాటుమాటుగా తచ్చాడుతుంటారు. ఏదో ఒక మూలకో, చెట్ల కిందనో అడ్డాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కార్యాలయ సిబ్బంది కుర్చీల్లో కూర్చోవడం మినహా అన్ని పనులూ నిర్భయంగా చేస్తుంటారు, దర్జాగా తిరుగుతుంటారు. ఆర్టీఓ కార్యాలయ సిబ్బందికి అనధికారికంగా వీరు పనులు చక్కబెడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇక్కడ సిబ్బంది, దళారులు పాలు, నీళ్లలా కలిసిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళితే జీరో కౌంటర్‌లోనే సవాలక్ష కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఫలితంగా క్యాష్‌లెస్ సేవల స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయి. లైసెన్సు, వాహనాల రిజిసే్ట్రషన్ తదితర పనులు కావాలంటే దళారులు నిర్ణయించిన మొత్తం సమర్పించుకోవాల్సి వస్తోంది.
దళారీ రాజ్యం..
దళారీల రాజ్యంగా మారిన రవాణా శాఖ కార్యాలయంలో భూపాలపల్లికి చెందిన ఓ వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జీరో కౌంటర్‌లో పని చేస్తున్న సిబ్బందికి అనుబంధంగా దళారులను నియమించడంతో ఇతని వ్యవహారాలు మొదలవుతాయి. అనంతరం వివిధ సేవలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా టార్గెట్లు విధించడం, ఆ అక్రమ సంపాదనను వాటాలుగా పంపిణీ చేయడం తదితర కీలక పనులన్నీ చక్కబెడతాడు. ఏడాది కిందట ఇతన్ని రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలోకి వచ్చేందుకు అనుమతించలేదు. ఇతని రాకను అడ్డుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.
ఒకవేళ వారి కళ్లుగప్పి కార్యాలయంలో కనిపిస్తే అరెస్ట్ చేయిస్తామన్నంతగా నిషేధం విధించారు. అయితే తెర వెనుక వ్యవహారాల కారణంగా ఆర్నెళ్లుగా మళ్లీ ఆర్టీఓ కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నాడు. గతాన్ని మించిపోయేలా దళారీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తున్నాడు. ఈ విభాగంలో పని చేసే ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఇతను ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది.
–ఈ కార్యాయలంలో ఓ అధికారికి ఏర్పాటు చేసిన అద్దె వాహనం డ్రైవర్ తన విధులు పక్కన పెట్టి దళారీ అవతారం ఎత్తాడు. ఉన్నతాధికారుల మద్దతు ఉందని చెప్పుకుంటూ శాఖ సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
– పరిపాలన విభాగంలో దళారుల పనులకు ఢోకా లేకుండా ప్రత్యేకంగా ఓ వ్యక్తి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నాడు. కింద జీరో కౌంటర్‌లో దళారుల ద్వారా వచ్చిన దరఖాస్తు పనులు వేగంగా జరిగేలా చూడటం ఇతని విధి.