నగరంలోని డేంజర్ స్పాట్స్
♦ సిటీలో 46 ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు
♦ రెండేళ్ళ గణాంకాల బేరీజుతో నిర్ధారణ
♦ 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనే ఇవన్నీ
♦ నివారణ చర్యలు ప్రారంభించిన ట్రాఫిక్ కాప్స్
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చిన్నారి రమ్యతో పాటు ఆమె కుటుంబంలో మరో ఇద్దరు ప్రాణాలు తీసిన ప్రాంతం బ్లాక్ స్పాటే. ఆ ప్రాంతంలో పది రోజుల వ్యవధిలో దీంతో పాటు మరో రెండు యాక్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. అయితే వాటిలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి పెట్టారు.
తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్ ఠాణాల పరిధిలో నిర్వహించిన స్టడీలో 46 నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్లాక్‌స్పాట్స్(డేంజర్ స్పాట్స్) ఉన్నట్లు గుర్తించారు.
రెండేళ్ళ గణాంకాలతో స్టడీ...
సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. గడిచిన రెండేళ్ళ వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించి అధ్యయనం చేశారు. ఒకే ప్రాంతం, స్టెచ్‌లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాలను గుర్తించారు.
18 ఠాణాల పరిధిలో ‘జోన్స్’...
నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఏడింటి పరిధిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. మిగిలిన 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనూ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగేసి, పదింటి పరిధిలో మూడేసి చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్‌లో (ఐఆర్‌ఆర్) విస్తరించిన ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణాలనూ స్థానిక అధికారుల సాయంతో అధ్యయనం చేశారు.
అంతా కలిసి పని చేయాలని: ‘రోడ్డు భద్రత కోణంలో హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం కేవలం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులే కాకుండా మిగిలిన విభాగాలతోనూ కలిసి పని చేయాలని నిర్ణయించాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికే బ్లాక్‌స్పాట్స్‌తో పాటు కారణాలను అధ్యయనం చేశాం. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల బాధ్యతగా చిన్న చిన్న మార్పులు చేపట్టడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను పెంచుతున్నాం.
ఇంజినీరింగ్ సహా ఇతర లోపాలను గుర్తించిన చోట్ల వాటిని సరిచేయాలని కోరుతూ ఆయా విభాగాలకు నివేదికలు అందిస్తున్నాం. ఉన్నతాధికారులతో జరిగే ఉమ్మడి సమావేశాల్లో సిఫార్సుల అమలు స్థితిగతుల్ని పరిశీలించే ఏర్పాట్లు జరిగాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, అవసరమైన అనుమతులు లేకుండా తవ్వకాలు, మరమ్మతులు చేపట్టవద్దని ఇప్పటికే స్పష్టం చేశాం’
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ