గమ్యం చేరేది డౌటే! | danger to private vehicle journey | Sakshi
Sakshi News home page

గమ్యం చేరేది డౌటే!

Published Thu, Mar 2 2017 11:04 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

గమ్యం చేరేది డౌటే! - Sakshi

గమ్యం చేరేది డౌటే!

–  అత్యంత ప్రమాదకరంగా ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణం
– పాలెం ఘటన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యల పేరుతో ‘ఆర్టీఏ’ హడావుడి
– అప్పట్లో 79 సర్వీసులకు ‘బ్రేక్‌’...మళ్లీ పది రోజులకే గ్రీన్‌సిగ్నల్‌
–  ఆ తర్వాత తనిఖీల ఊసే ఎత్తని అధికారులు
– ప్రైవేటుకు టాటా చెప్పి...ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
– బుధ, గురువారాల్లో తీవ్రంగా తగ్గిన ట్రావెల్స్‌ టిక్కెట్ల విక్రయాలు


మొన్న పాలెం వద్ద జబ్బార్‌ ట్రావెల్స్‌...నిన్న ముండ్లపాడు వద్ద దివాకర్‌ ట్రావెల్స్‌! ఈ రెండు బస్సు ప్రమాద ఘటనలను నిశితంగా పరిశీలిస్తే ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఇట్టే తెలుస్తోంది. అనుభవం లేని డ్రైవర్లు, విశ్రాంతి లేని డ్యూటీలు..కండీషన్‌ లేని బస్సులు...వీటన్నిటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం వెరసీ  ‘డేంజర్‌ జర్నీ’గా మారుతోంది. పై రెండు బస్సులూ జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడంతో ప్రస్తుతం ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు.

(సాక్షిప్రతినిధి, అనంతపురం)
        జిల్లాలో ప్రైవేటు బస్సులు నడిపే ఆపరేటర్లు 28 ఉంది ఉన్నారు. వీరు అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్‌ చేయించి నడుపుతున్నారు. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్,  ఎనిమిది బస్సులకు ఆలిండియా పర్మిట్‌ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులు కలిపి జిల్లా మీదుగా 230 నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఇవి తిరుగుతున్నాయి.

నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ఈ బస్సులలో చాలా వరకూ అనుభవం ఉన్న డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్‌ ఒకే డ్రైవరుతోనే సర్వీసులు నడుపుతున్నాయి. నిబంధనలు పాటించకుండా నడిచే సర్వీసులు కూడా చాలానే ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మొరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా.. ఏ సందర్భంలోనూ ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం ట్రావెల్స్‌ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్సంబంధాలే!

మహబూబ్‌నగర్‌ ఘటన తర్వాత హడావుడి..
    నాలుగేళ్ల కిందట మహబూబ్‌నగర్‌లో జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు అగ్నికి ఆహుతై  45మంది దుర్మరణం చెందారు. దీంతో జిల్లాలో ట్రావెల్స్‌ పరిస్థితి ఏంటని కలెక్టర్, ఆర్టీఏ అధికారులు అప్పట్లో సమీక్ష నిర్వహించారు. పదిరోజులు హడావుడి చేసి 79 బస్సులను ఆపేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు, బస్సులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు తీసుకునే చర్యలపై లిఖిత పూర్వకహామీ ఇవ్వాలని ట్రావెల్స్‌ యజమానులను కోరామని, అవి అందేదాకా ఎట్టిపరిస్థితుల్లోనూ బస్సులకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని అప్పట్లో ఆర్టీఏ అధికారులు గట్టిగా చెప్పారు.

అయితే.. ట్రావెల్స్‌ యజమానులు లెటర్‌ప్యాడ్‌లో హామీలు ఇచ్చేదాని కంటే ప్రతి బస్సులో సౌకర్యాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్నవాటికి అనుమతులు ఇవ్వాలనే ఆలోచన అధికారులకు లేకపోయింది. చివరకు ప్రతి బస్సులో ఓ ‘సుత్తి’ పెట్టుకోండని సలహా ఇచ్చి.. బస్సులు తిరిగేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అప్పుడు ప్రమాదానికి కారణమైన జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించినదే! ఇప్పుడు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది కూడా దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సే.  

ఏదీ వీటిపై శ్రద్ధ?
        జిల్లాలోని చాలా ట్రావెల్స్‌ బస్సులకు విండోస్‌ లేవు. పూర్తిగా అద్దంతో మూసేశారు.  హైటెక్‌ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్‌ అయిపోతోంది. దీనివల్ల ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగలగొట్టచ్చనే సూచీలు,  అత్యవసర ద్వారాలు కూడా కన్పించడం లేదు. స్లీపర్‌ కోచ్‌లలో పరిస్థితి మరీ దారుణం. స్మోక్‌ అలారమ్‌ ఉంటే బస్సులో ఏదైనా రిపేరీ వచ్చినా, ప్రమాదవశాత్తు పొగ వచ్చినా వెంటనే అది మోగుతుంది.  ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బయటపడే అవకాశం ఉంటుంది.

అయితే..వీటిని ఏ బస్సులోనూ ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులను ఒకే డ్రైవర్‌తో నడుపుతున్నారు. అదే ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటుందన్నారు. చాలా ట్రావెల్స్‌ బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నాయి.  చాలా  ట్రావెల్స్‌లలో.. మరీ ముఖ్యంగా దివాకర్‌ ట్రావెల్స్‌లో బస్సులు నడిపేవారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు 47 ఉన్నాయి. వీరికి వందకుపైగా లారీలు కూడా ఉన్నాయి. దీంతో లారీ డ్రైవర్లను కూడా బస్సులకు డ్యూటీ వేస్తుంటారని తెలుస్తోంది. పైగా వీరు డ్యూటీలకు వెళితే పదిరోజుల వరకూ ఇళ్లకు తిరిగి రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదాలకు కారణమే! ఈ ట్రావెల్స్‌ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలది కావడంతో ప్రశ్నించే నాథులే లేరు.  దీంతో పాటు చాలా ట్రావెల్స్‌ నుంచి ప్రతి నెలా ఆర్టీఏ అధికారులకు భారీగానే మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

తనిఖీలు నిర్వహిస్తాం: సుందర్, ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ)
        బెంగళూరు– హైదరాబాద్‌ సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ జర్నీ ఏడు గంటలే. దీంతో ఒకే డ్రైవర్‌ నడుపుతున్నారు. లాంగ్‌జర్నీ అయితే ఇద్దరూ ఉండాలి. స్పీడ్‌లిమిట్‌ 80–100 కిలోమీటర్లలోపు ఉండాలి. డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉన్నాయా? రికార్డులో చూపినట్లు బస్సు కండీషన్‌ ఏంటనేది నెల, రెండు నెలలకోసారి తనిఖీలు చేస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement