‘చీకటి’ దందా !
‘చీకటి’ దందా !
Published Sun, Aug 21 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
నిజామాబాద్ అర్బన్: మారుమూల పల్లెల్లో కాదు.. ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఇసుక దందా జోరందుకుంది. చిమ్మచీకట్లో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రి 11 దాటితే చాలు.. ఇసుక లారీలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కంఠేశ్వర్, గంగస్థాన్ తదితర ప్రాంతాలు ఈ చీకటి దందాకు అడ్డాగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులు వెలిశాయి. బహిరంగంగానే ఇసుక నిల్వలు కనబడుతున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు.
అర్ధరాత్రి వేళ..
కంఠేశ్వర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఇసుక లారీలు దూసుకెళ్తున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అర్ధరాత్రి వేళ ఇసుక రవాణాను యధేచ్ఛగా చేపడుతున్నారు. మంజీర, బోధన్, నందిపేట్, జన్నేపల్లి, జక్రాన్‌పల్లి ప్రాంతాల నుంచి రాత్రివేళ అధిక లోడ్‌తో టిప్పర్ల ద్వారా ఇసుకను తీసుకొస్తూ, గంగస్థాన్ ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. వందలాది లారీల ఇసుక ఉంది. గంగస్థాన్1, 2 ఫేజ్‌లలో, కంఠేశ్వర్‌లోని బైపాస్ రోడ్డు పక్కన , శ్రీరామాగార్డెన్ సమీపంలో, ఓ పెట్రోల్ బంకు వెనక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక డంపులు వెలిశాయి. నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో వందలాది లారీల ఇసుకను డంప్ చేశారు. ఈ స్థలంలో అనధికారికంగా మరో ప్రైవేటు వ్యక్తి ఇసుకను నిలిపినందుకు అద్దె తీసుకోవడం గమనార్హం. రాత్రి 11 గంటలైతే జిల్లా కేంద్రం నుంచి 30–40 టిప్పర్ల లో ఇసుక రవాణా కొనసాగుతోంది. తెల్లవారుజామున 5 గంటల వరకు అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో నివాసగృహాలు ఎక్కువగా ఉన్నాయి. నివాస గృహాలకు ఆనుకుని ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈస్థలాల్లోనే ఇసుకను డంప్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీల రాకపోకల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల మోతతో నిద్ర కూడా సరిగా ఉండడం లేదని వాపోతున్నారు. అధిక లోడ్‌తో దూసుకెళ్తుండడంతో రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఒక్కరే 20 టిప్పర్లతో ఇసుకదందాను కొనసాగిస్తున్నారు. మరో వ్యాపారి గంగస్థాన్‌లో ప్రహరీ నిర్మించి, ఇక్కడ 30 టిప్పర్ల ద్వారా ఇసుకను డంపు చేయిస్తున్నారు. తన కార్యాలయం వెనకనే వందలాది లారీల ఇసుకను నిల్వ చేసుకున్నారు. మరో వ్యాపారి గంగస్థాన్‌లో ప్రధాన రోడ్డును ఆనుకుని ఇసుకను డంపు చేస్తున్నారు. అందేకాదు, మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, నాగారం ప్రాంతం నుంచి అక్రమంగా మొరం తీసుకొస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
వందలాది టిప్పర్ల ఇసుక డంపులు నడిబొడ్డున ఉన్నా.. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇసుక డంపులు ఉన్న ప్రాంతాలు ప్రధాన రోడ్డుకు ఆనుకునే ఉన్నాయి. అయినా స్పందించడం లేదు. ఇక రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు సైతం ఇసుక లారీలను చూసీచూడనట్లు వదిలేస్తుండడం విశేషం. వ్యాపారులు అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇవ్వడంతోనే ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement