అల్లుడిని చూసేందుకు వచ్చి దుర్మరణం
Published Sun, Sep 18 2016 10:33 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
నిజామాబాద్ క్రైం:
అనారోగ్యానికి గురైన అల్లుడిని చూసేందుకు వచ్చిన అత్తను వేగంగా దూసుకొచ్చిన లారీ చిదిమేసింది. ఈ ఘటన ఒకటో టౌన్ ఠాణా పరిధిలోని అర్సపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో రవీందర్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం కుంట గల్లీకి చెందిన సాబేరా బేగం (60) కూతురు నిజామాబాద్ ఆటోనగర్‌లో ఉంటోంది. అల్లుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసేందుకని సాజీరాబేగం ఆదివారం భైంసా నుంచి బస్సులో బయల్దేరింది. అర్సపల్లికి రాగానే ఆమె బస్సు దిగింది. అయితే, బస్సు వెనుకాలే ఉన్న లారీ (ఎంహెచ్ 26 ఏడీ 0878) అర్సపల్లి బైపాస్ వైపు వెళ్లేందుకు మలిగింది. ఈ క్రమంలో అది గమనించని సాజీరా బేగం లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. తల పగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు లారీని ధ్వంసం చేసేందుకు యత్నించగా, అక్కడే వన్‌టౌన్ పోలీసు బూత్ సిబ్బంది వారిని నిలువరించారు. లారీ డ్రైవర్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మృతురాలి వద్ద లభించిన ఫోన్‌లో ఉన్న నెంబర్ల ఆధారంగా ఆటోనగర్‌లో ఉంటున్న మనువడు షేక్ జావేద్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ అక్కడకు చేరుకున్నారు. ఎస్సై తలాలిక్ ఖాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement