కాటేసిన మృత్యువు
కాటేసిన మృత్యువు
Published Mon, Mar 13 2017 9:23 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
- అంకిరెడ్డిపల్లె వద్ద ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత
- హళేబీటు వద్ద లారీ ఢీకొని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి
- రెండు ప్రమాదాలకు అతివేగమే కారణం
బతుకుబాటలో మృత్యుఒడి
కొలిమిగుండ్ల: పొట్టకూటి కోసం తెల్లారకముందే బతుకుబాట పట్టిన ముగ్గురు మహిళా కూలీలు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన మహిళా కూలీలు నెల రోజుల నుంచి అవుకు మండలం కాశీపురం గ్రామంలో మిరప పంట కోతకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామునే 40 మంది మహిళలు ట్రాలీ ఆటోలో బయలు దేరారు. ఆటో పైన చెక్క పలకలు వేసిన డ్రైవర్ ట్రాలీలో కొంత మందిని, పలకలపైన మరి కొంత మందిని ఎక్కించారు. ఓవర్ లోడుతో ఊరు నుంచి రెండు కి.మీ దాటగానే ప్రధాన రహదారిపై కనకాద్రిపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యన ఆటో బోల్తా పడింది. ఇంకా పొద్దు పొడవక పోవడంతో మసక చీకటల్లో ఏమి జరిగిందో తెలియక మహిళలు కేకలు వేశారు. సంఘటన స్థలంలోనే అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యర్రగుడి చెన్నమ్మ(50), పుచ్చల లక్ష్మీదేవి (46)అక్కడిక్కడే దుర్మరణం చెందారు. దూదేకుల కుళ్లాయమ్మ(55) తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడే అమె మృతి చెందింది.
దూదేకుల ఫాతీమాకు తీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో అనంతపురంలోని ఓప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తులశమ్మతో పాటు మాజీ సర్పంచ్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరితో 30 మందికి పైగా మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. సాయం కోసం క్షతగాత్రులు హాహకారాలు చేశారు. కూలీలు వెంట తెచ్చుకున్న సద్ది కూడా కింద పడి రక్తసిక్తమైంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి.
అంబులెన్స్ సకాలంలో రాక పోవడంతో అంకిరెడ్డిపల్లెకు చెందిన పారిశ్రామిక వేత్త అన్నెం జయరామిరెడ్డి మానవతా దృక్పథంతో తన స్కార్పియో వాహనంలో గాయాల పాలైన మహిళలను తాడిపత్రికి తరలించారు. ఏఎస్‌ఐ ఉస్మాన్‌ఘని, కానిస్టేబుల్ మహేష్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాద వివరాలను సేకరించి మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఉపాధి లేక వలస: ఊర్లో ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో జీవనోపాధి నిమిత్తం మహిళలు ఇతర మండలాలకు కూలీ పనులకు వలస వెళ్తున్నారు. అంకిరెడ్డిపల్లెలో మొక్కుబడిగా పనులు చేపట్టి మానేయడంతో చాలా మంది మహిళలు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాపరాతి గనులు ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు ప్రమాదకరమైన గని పని చేయలేక ఉపాధి పథకంలో జాబ్‌కార్డులు పొందినా ప్రయోజనం లేదు.
Advertisement