ప్రమాదానికి కారణమైన ఆటో
బతుకుబాటలో మృత్యుఒడి
Published Sun, Jan 22 2017 10:11 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- ఆటో– మినీ వ్యాన్ ఢీ
– ఇద్దరు మహిళలు మృతి
– మరో ఇద్దరిపరిస్థితి విషమ..11మందికి స్వల్పగాయాలు
– మిరపపండు తెంచే పనికి వెళ్తుండగా ఘటన
ఎమ్మిగనూరు, రూరల్: వారు దినసరి కూలీలు. పనిచేస్తే కానీ పూటగడవదు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం మిరపపండు తెంచే పనికి 15 మంది ఆటోలో బయలుదేరారు. ఎమి్మగనూరు పట్టణ సమీపంలోని కర్నూల్ రోడ్డు ఇటుకల బట్టీ సమీపంలో ఆటో–మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో రమిజాబీ(52), మహబూబ్‌బీ(45) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతావారికి స్వల్పగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. పట్ణణంలోని పెద్దకమేళ ప్రాంతానికి చెందిన కూలీలు ఎర్రకోట గ్రామం దగ్గర మిరప పండు తెంచేందుకు వెళ్తారు. ఆదివారం ఎర్రకోటకు చెందిన ఏపీ 21వై 3318 నంబర్ గల ఆటోలో పనికి బయలుదేరారు. ఎర్రకోట నుంచి ఏపీ 21వై 0975 నంబర్ గల మినీ వ్యాన్ ఎమ్మిగనూరుకు వస్తుంది. పట్టణంలోని ఇటుకల బట్టీ దగ్గర ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి వ్యాన్ బాడీకి ఆటో తగిలి పల్టీ కొట్టింది. దీంతో ఆటో వెనుక కూర్చున్న రమిజాబీ(52) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబ్‌బీ, దిల్‌షాబీ, జహీరాలకు తీవ్ర గాయాలుకాగా మిగతా 11 మందికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ కె.హరిప్రసాద్, సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నడుము విరిగిపోవడంతో మహబూబ్‌బీ(45)ని మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తరలించారు. అయితే, కోలుకోలేక కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దిల్‌షాబీ, జహిరాబీల పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎమ్మిగనూరు ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ బాలజీకుమార్ కర్నూలుకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పట్ణణ ఎస్‌ఐ కె.హరిప్రసాద్ విలేకరులకు తెలిపారు.
శోకసంద్రంలో మృతుల కుటుంబసభ్యులు
ప్రమాదంలో మృతిచెందిన రమిజాబీ, మహబూబ్‌బీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రమిజాబీకి భర్త బడేసావు, ఇద్దరు కూతుళ్లు సంతానం. మహబూబ్‌బీకి భర్త వలి, ముగ్గురు ఆడప్లిలలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఓవర్‌లోడే ప్రమాదానికి కారణమా!
ఆటో కెపాసిటీకి మించి డ్రైవర్ 15మందిని ఎక్కించుకుని వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇటుకలబట్టీ దగ్గర ఆటోను డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Advertisement
Advertisement