
ఆడిపాడిన బ్యూటీషియన్లు
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు) : అతివల అందాలకు మెరుగుదిద్దే బ్యూటీషియన్లంతా వేడుక చేసుకున్నారు. క్యాట్‌వాక్‌తో కేక పుట్టించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి హొయలుపోయారు. ఆడిపాడుతూ బ్యూటీషియన్స్ డేకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టారు. సంప్రదాయ వస్త్రధారణతోపాటు వెస్ట్రన్ స్టయిల్ జోడించి వారెవ్వా అనిపించారు.
సోమవారం అంతర్జాతీయ బ్యూటీషియన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేటు హోటల్‌లో విశాఖ బ్యూటీ థెరిపిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కళ్లు తిప్పుకోనివ్వలేదు. లేటెస్ట్ సాంగ్స్‌కు కాలు కదుపుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో వీ టీమ్ వీరుమామా, అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి లక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా తల్లీకూతుళ్లు
కీడ్ని పూర్తిగా పాడైపోయిన కూతురుకు తన కిడ్నీ ఇచ్చి మరోసారి జన్మనిచ్చింది ఆ తల్లి. మురళీనగర్‌లో బ్యూటీ క్లినిక్ నడుపుతున్న గీతా శిరీష్‌కు ఐశ్వర్య అనే కూతురు ఉంది. తనకు 2014లో కిడ్నీ పాడైందని డాక్టర్లు తెలిపారు. ఐశ్వర్యకు సంవత్సరం పాటు డయాలసిస్ చేశారు. కిడ్నీ మార్చక పోతే ఆమె బతకదని డాక్టర్లు చెప్పారు. దీంతో కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది తల్లి గీతాశిరీష్. బ్యూటీషియన్ డేలో తల్లీకూతుళ్లు క్యాట్‌వాక్, డ్యాన్స్‌లతో అందర్నీ ఆకర్షించారు. తల్లి ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన గీతాశిరీష్‌కు ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు. ఐశ్వర్య ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది.