నేను ఎవరనుకుంటున్నారు అంటూ మార్గదర్శి మేనేజర్‌ భార్య | - | Sakshi
Sakshi News home page

నేను ఎవరనుకుంటున్నారు అంటూ మార్గదర్శి మేనేజర్‌ భార్య

Published Thu, Sep 7 2023 12:46 AM | Last Updated on Thu, Sep 7 2023 12:27 PM

- - Sakshi

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగరంలో ఒక బ్యూటీషియన్‌ ఇంట్లో మంగళవారం ఉదయం జరిగిన చోరీ ఎంతగా కలకలం రేపిందో ఆ చోరీలో ప్రముఖ వ్యక్తుల భార్యలు నిందితులుగా పోలీసులకు దొరకడం కూడా అంతే సంచలనం సృష్టించింది. స్థానికంగా శ్రీకృష్ణ నగర్‌లో బ్యూటీ పార్లర్‌ నిర్వహించే షేక్‌ రజియా మీద దాడి చేసి ముగ్గురు మహిళలు పట్టపగలే చోరీకి పాల్పడడం తెలిసిందే. దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న ఎస్పీ మలికా గర్గ్‌ తక్షణమే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలూకా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన వారికి కీలక సమాచారం లభ్యమైంది. తీగలాగితే డొంక కదిలింది.

నగరంలోని ముంగమూరు రోడ్డులో ధనవంతులు నివశించే మైటీ హోం అపార్ట్‌మెంట్‌, దానికి కొద్ది సమీపంలోని ఐక్య అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్న పోలీసులను చూసి అక్కడి జనం ఆశ్చర్యపోయారు. సరాసరి ఒంగోలు మార్గదర్శి మేనేజర్‌ కరణం నాగేశ్వరరావు ఫ్లాట్‌ వద్దకు వెళ్లిన పోలీసులు ఈ కేసులో నిందితురాలైన కరణం మోహన దీప్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన నిందితులు ముండ్రు లక్ష్మీ నవత, రిటైర్డ్‌ ఏఎస్సై కోడలు అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్‌ సాహేర భానును కూడా అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితురాలే సమాచారం ఇచ్చింది...
బ్యూటీషియన్‌ రజియాకు రాజీవ్‌ నగర్‌లో నివశించే దాసరి భాను ఉరఫ్‌ షేక్‌ సాహెర భాను మంచి స్నేహితురాలు. తరచుగా ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్లు. మంచి, చెడ్డ మాట్లాడుకునేవాళ్లు. అయితే రజియా వద్ద లక్షల విలువ చేసే బంగారం ఉన్న విషయాన్ని గ్రహించిన భానుకు కన్నుకుట్టింది. అదే సమయంలో భానుకు కిలాడీ ముఠాతో కూడా బాగా పరిచయం ఉంది. వారి చేతివాటం గురించి కూడా ఆమెకు తెలుసు. రజియా వద్ద ఉన్న బంగారం, ఆమె ఒంటరిగా ఉండే సమయం గురించి వారికి సమాచారం ఇచ్చింది. అసలే దొంగతనాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా.. వెంటనే రంగంలోకి దిగారు. పట్టపగలే దొంగతనానికి తెగబడ్డారు.

రెక్కీ చేసి మరీ దొంగతనం...
బ్యూటీషియన్‌ రజియా ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ముందు ఈ కిలాడీ ముఠా రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. రజియా ఇంటి పరిసరాలు, ఇంటి చుట్టు పక్కల వాతావరణాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అప్పటికే ఒకటికి రెండుసార్లు చోరీలు చేసి ఉండడంతో చేయి తిరిగిన దొంగల్లా చోరీకి పాల్పడ్డారు. ఒకవేళ ఏదైనా ప్రతిఘటన జరిగితే ఎదుర్కొనేందుకు వెంట క్లోరోఫాం స్ప్రే చేసిన రుమాలును, యాసిడ్‌ లాంటి ద్రావణాన్ని తెచ్చుకున్నారు.

అయితే చోరీ సమయంలో రజియా తిరగబడటంతో ఆగ్రహానికి గురైన ఈ ముఠాలోని ఒక మహిళ బూతులు తిడుతూ వెనుక నుంచి గట్టిగా నోరు మూసేసిట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రజియాను బలవంతంగా యాసిడ్‌ తాగించే ప్రయత్నం చేయడం గమనిస్తే వీరు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది.

ఒంటరి మహిళలే టార్గెట్‌...
ఈ ముగ్గురు దొంగల ముఠా గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వీరి మీద 20012లో పెళ్లూరు గ్రామంలో జరిగిన ఒక దొంగతనం కేసు నమోదైంది. ఒక అపార్ట్‌మెంటులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ప్లాటులో చోరీకి పాల్పడ్డారు. అలాగే పొదిలి, దొనకొండల్లో కూడా వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఒంటరి మహిళలను, వృద్ధులను టార్గెట్‌ చేసిన ఈ కిలేడి ముఠా ఇంకా ఎన్ని దొంగతనాలకు పాల్పడ్డారో మొత్తం విచారణ జరిగితే తెలుస్తుంది.

ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురి నేరాల చిట్టా తేల్చేందుకు విచారణ చేపట్టారు. గతంలో రుణాలు తీసుకోవడం, తక్కువ వడ్డీలు అంటూ అనేక మందిని మోసం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కొంతమంది యువకులు కూడా వీరితో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని సమాచారం. ఈ ముగ్గురు మహిళల్లో ఒకరి భర్త దగ్గర పనిచేసే యువకులను చేరదీసినట్లు సమాచారం.

రచ్చ చేసిన దీప్తి...
బ్యూటీషియన్‌ మీద దాడి చేసి చోరీకి పాల్పడిన కరణం మోహన దీప్తి పోలీసుల ఎదుట రచ్చ చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలలో లభ్యమైన చిత్రాలు, ఇతర పక్కా సమాచారంతో ఐక్య అపార్ట్‌మెంటుకు వెళ్లిన పోలీసులతో తొలుత ఆమె వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మీరు ఎవరి ఇంటికి వచ్చారు..నేను ఎవరనుకుంటున్నారు... మార్గదర్శి మేనేజర్‌ భార్యను... అంటూ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలు చూసిన తరువాత కిమ్మనకుండా పోలీసు వ్యాన్‌ ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement