విద్యార్థిని మృతదేహం
- హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మరణం
- కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన
- పరిస్థితి ఉద్రిక్తం, పోలీసుల భారీ బందోబస్తు
ఖమ్మం క్రైం : నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మచేసుకున్న ఘటన బుధవారం సంచలనం సృష్టించింది. కళాశాల వారి వేధింపులతోనే విద్యార్థిని మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కురవి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పగడాల భవాని (19) నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఆ కళాశాలకు సంబంధించిన హాస్టల్లోనే ఉంటోంది. బుధవారం కళాశాలలో రెండు క్లాసుల అనంతరం విరామ సమయంలో తాను ఉంటున్న హాస్టల్ గదికి వెళ్లింది. ఆ సమయంలో హాస్టల్లో స్వీపర్ మాత్రమే ఉంది. హాస్టల్ గదికి వెళ్లిన భవాని ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్వీపర్ ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా భవాని ఫ్యాన్‌కు వేళ్లాడుతూ కనిపించింది. వెంటనే స్వీపర్ కేకలు వేస్తూ కళాశాల సిబ్బందిని పిలవడంతో వారు హుటాహుటిన వచ్చి తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే భవాని మృతి చెందింది. దీంతో కళాశాల సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఓంకార్‌యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహం పక్కన మంచంలో ఓ లేఖ కూడా రాసి ఉంది. ఆ లేఖలో తన పెద్దమ్మ ఇటీవల చనిపోయిందని, ఆమె మృతితో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, దీంతో చదువుకోలేకపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి తల్లిదండ్రులు రాణెమ్మ, వెంకటరెడ్డికి సమాచారం అందించారు. తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కుమార్తె కళాశాల సిబ్బంది వేధింపుల వల్లనే చనిపోయిందని, కావాలనే లేఖను పక్కన పెట్టారని, మృతదేహాన్ని వెంటనే తరలించడం ఏమిటని ఆందోళన చేశారు. విద్యార్థి సంఘం నాయకులు భవాని కుటుంబానికి న్యాయం చేసి కళాశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల వద్ద, మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం భవాని మృతిపై విచారణ చేస్తామని కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీ వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.