ఎందు‘గంటా’లేటంట?
ఒక జత యూనిఫాం కుట్టుకూలి రూ. 40లు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే రెండు జతలకూ చేసే ఖర్చు రూ. 80లు. అదే జిల్లాలోని లక్షా 63వేల 680మంది పిల్లలకు ఇచ్చే బట్టల కుట్టుకూలి కోటీ 30 లక్షల 94వేలు. క్లాత్‌కోసం చేస్తున్న ఖర్చు రూ. 5.17కోట్లు... మొత్తం సుమారు ఆరున్నర కోట్లు. ఇంత పెద్ద మొత్తం చూసిన పచ్చనేతలకు కళ్లు బైర్లు కమ్మాయేమో... ఆ కాంట్రాక్టేదో.. తామే దక్కించుకుంటే బాగుంటుందనుకున్నారు.
మూడు నెలలైనా పిల్లలకందని యూనిఫాం
కాంట్రాక్టుకోసం ఓ అమాత్యుని తాపత్రయం
రూ. 6.50కోట్ల బడ్జెట్‌ను వదులుకోలేకే ఈ యత్నం
క్లాత్ సరఫరాతోబాటే... కుట్టించే బాధ్య కూడా ఆప్కోకే...
వారినుంచి అనధికారికంగా దక్కించుకోవాలని మంత్రి ఎత్తుగడ
జిల్లాలో యూనిఫాం క్లాత్ కోసం చేసే ఖర్చు : రూ. 5.17కోట్లు
కుట్టు కూలి : రూ. కోటి 30లక్షలు
విద్యార్థుల సంఖ్య : లక్షా 63వేల 680
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఒక జత యూనిఫాం కుట్టుకూలి రూ. 40లు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే రెండు జతలకూ చేసే ఖర్చు రూ. 80లు. అదే జిల్లాలోని లక్షా 63వేల 680మంది పిల్లలకు ఇచ్చే బట్టల కుట్టుకూలి కోటీ 30 లక్షల 94వేలు. క్లాత్‌కోసం చేస్తున్న ఖర్చు రూ. 5.17కోట్లు... మొత్తం సుమారు ఆరున్నర కోట్లు. ఇంత పెద్ద మొత్తం చూసిన పచ్చనేతలకు కళ్లు బైర్లు కమ్మాయేమో... ఆ కాంట్రాక్టేదో.. తామే దక్కించుకుంటే బాగుంటుందనుకున్నారు. అంతే అవకాశం ఉన్న అమాత్యుడు రంగంలోకి దిగారు. క్లాత్ సరఫరా చేసే బాధ్యతతోపాటు... కుట్టించే బాధ్యత కూడా వారికే అప్పగించేస్తే... వారినుంచి అనధికారికంగా తానే ఆ కాంట్రాట్టు పొందాలని ఎత్తు వేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే బడులు తెరచి మూడు నెలలైనా... పిల్లలకు యూనిఫాం అందలేదు. ఇవేమీ తెలియని ఆ చిన్నారులు దుస్తులకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బడి పిల్లలకు యూనిఫాంకోసం ఏటా మే నెలలో ఇండెంట్ తీసుకుని, జూన్ నెలలో పంపిణీ చేయాలి. నిబంధనల మేరకైతే ఆప్కో ద్వారా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు క్లాత్ సరఫరా చేస్తే స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా వాటిని కుట్టించాలి. క్లాత్ సరఫరా బాధ్యత అప్కోకు అప్పగిస్తే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందనీ, స్థానికంగా కుట్టుపనిచేసేవారికి పని దొరుకుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కోట్లలో జరిగే ఈ వ్యవహారంపై పచ్చనేతల కళ్లు పడ్డాయి. అంతే... చేనేత కార్మికుల నుంచి నేరుగా ముంబాయి, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో మిల్లుల్లో తయారైన క్లాత్‌నే తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ కీలక నేతలకు, ఆప్కో ఉన్నత స్థాయి వర్గాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ తరహా లోపాయికారీ తంతు కారణంగానే జిల్లాలకు ఇంతవరకు క్లాత్ చేరలేదని సమాచారం. ఒక్క విజయనగరం జిల్లాలోనే రూ. 5.17కోట్ల మేర క్లాత్ కోసం ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంకెంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంట్లో కొంత నొక్కేయడానికి నేతలు పన్నాగం పన్నుతున్నారు.
కుట్టు కూలిపైనా.. కన్ను!
కుట్టు కోసం మంత్రుల స్థాయిలో కక్కుర్తి పడుతున్నారు. నిబంధనల మేరకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు క్లాత్ సరఫరా చేస్తే స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా విద్యార్థుల నుంచి నేరుగా కొలతలు తీసుకుని కుట్టించి ఇవ్వాలి. అయితే, ఒక మంత్రి దీనికి ససేమిరా అంటున్నారు. కుట్టు కాంట్రాక్ట్‌ను ఎవరికో ఎందుకు... అదేదో మనవద్దే ఉంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే తెగ తాపత్రయం పడుతున్నారు. నేరుగా కుట్టు కాంట్రాక్ట్‌ను తీసుకుంటే విమర్శల పాలవుతామనే ఉద్దేశంతో ఆప్కోను తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. క్లాత్ సరఫరా బాధ్యతలను ఎలాగైతే ఇచ్చారో, కుట్టు కాంట్రాక్ట్‌ను కూడా ఆప్కోకు ఇచ్చేయాలని నిర్ణయినట్టు కూడా తెలిసింది. వాస్తవానికైతే యూనిఫాం కుట్టే యూనిట్‌లు ఆప్కో వద్ద లేదు. సొంతంగా కుట్టించి ఇచ్చే సౌకర్యం లేదు. కానీ, గుడ్డిగా ఆప్కోకు ఇచ్చేయాలని చూస్తున్నారు. అధికారికంగా ఆప్కోకు ఇచ్చేసి, అనధికారికంగా ఆప్కో నుంచి కుట్టు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకే మంత్రి ఎత్తుగడలా కనిపిస్తోంది. ఒక్కో జతకు రూ. 40చొప్పున, ఒక్కో విద్యార్థికి రెండేసి జతలకు రూ. 80లు కుట్టు కింద ఖర్చు పెట్టనున్నారు. ఈ లెక్కన విజయనగరం జిల్లాలో రూ. కోటి 30లక్షల కుట్టు పనిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంకెంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.
ఇంతవరకు క్లాత్ రాలేదు– వేణుగోపాలరాజు, ఆప్కో మేనేజర్, విజయనగరం
క్లాత్ సరఫరా చేసే బాధ్యతను ఆప్కోకే అప్పగించారు. కుట్టు బాధ్యతలు ఆప్కోకే అప్పగించినట్టు తెలిసింది. కానీ, అధికారిక ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతానికైతే జిల్లాకు క్లాత్ చేరలేదు. మాకొచ్చినట్టయితే వేరొకరికి ఇచ్చి యూనిఫారాలు కుట్టిస్తాం.