మూడేళ్లుగా కబ్జాలు
విశాఖ భూబాగోతాలపై ‘సిట్’కు అయ్యన్న చిట్టా!
- 1700 ఎకరాల భూముల కబ్జాలపై ఫిర్యాదు
- మరిన్ని ఆధారాలతో 19న మళ్లీ ఫిర్యాదు చేస్తానని వెల్లడి
- పరోక్షంగా గంటా, ఆయన అనుచరులపై ఆరోపణలు
సాక్షి, విశాఖపట్నం: ‘2014 నుంచే విశాఖలో భూకబ్జాలు, దందాలు మొదలయ్యాయి. అవి ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి.. నెల్లూ రు, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాదు.. పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని రికార్డుల ట్యాంపరింగ్ చేసి వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ భూ దందాలపై నేనేమీ నిన్నా మొన్నా ఆరోపించలేదు. 2014లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా.. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించమని సీఎం చంద్రబాబుకు, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులకు లేఖలు రాశాను’ అని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ప్రైవేటు భూములను లిటిగేషన్‌లో పడేటట్టు చేయడం.. కొట్టేయడం లేదా తక్కువ ధరకు కాజేయడం.. ఆ తర్వాత ప్రభుత్వం వద్ద తమకున్న పలుకుబడిని ఉపయోగించి తమ పరం చేసుకుంటున్నారని పరోక్షంగా మంత్రి గంటా ఆయన అనుచరులపై ధ్వజమెత్తారు. విశాఖ సిటీ, జిల్లాలో జరిగిన భూ కబ్జాలు, దందాలపై తన వద్దనున్న ఆధారాలను ‘సిట్’ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆధారాలుంటే ఫిర్యాదు చేయాలని సీపీ నుంచి నిన్ననే తనకు లేఖ అందిందని, ఆమేరకు తన వద్దనున్న ఆధారాలు.. గడిచిన రెండేళ్లుగా ప్రముఖ దినపత్రికల్లో భూ కబ్జాలు, దందాలపై వచ్చిన కథనాల క్లిప్పిం గ్స్‌తో సహా ఫిర్యాదు చేశానన్నారు. సుమారు 1700 ఎకరాలకు సంబంధించిన అవకతవకలు.. కబ్జాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు.
మెడ్‌టెక్ పరిహారం .. ఓ కుంభకోణం
పెదగంట్యాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్ పార్కుకు భూసేకరణ కోసం జరిపిన పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని..రూ.2 కోట్లకు పైగా బినామీల మాటున కాజేశారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. జిరాయితీ, డి పట్టా రైతులతోపాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారికి పరిహారం ఇస్తే తప్పు లేదన్నారు. కానీ, ప్రభుత్వ భూముల్లో సాగుబడి లేకపోయినా కొంతమంది పేర్లు సృష్టించి మరీ ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని.. అంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మేశారని ఆరోపించారు. రూ.2 కోట్లకు పైగా బినామీల పేరిట స్వాహా చేసిన విషయాన్ని ‘సిట్’ దృష్టికి తీసుకెళ్లానన్నారు.
తనఖా పెట్టిన ప్రభుత్వ భూముల చిట్టా 19న ఇస్తా..
రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఓ బ్యాంకులో రూ.190 కోట్ల రుణం తీసుకుని ఎగనామం పెట్టిన వారి పేర్లు త్వరలోనే చెబుతానని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు వాళ్లు ప్రకటన కూడా చేశారన్నారు. ఇవేకాకుండా.. మరికొన్ని కబ్జాలు..దందాలపై ఆధారాలతో ఈనెల 19న ‘సిట్’ను మరోసారి కలసి ఫిర్యాదు చేస్తానన్నారు. ‘సిట్’ చీఫ్‌పై తనకు విశ్వాసం ఉందని, విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు.