రుషికొండ సర్వే నంబరు 19లో తొలగించిన రేకుల షెడ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర పరిసరాల్లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఈ డ్రైవ్‌లో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేసిన భూకబ్జాలు, చేసిన అక్రమ నిర్మాణాలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గతంలో ‘గీతం’, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుల ఆక్రమణలు బయటపడగా.. తాజాగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా భూ కబ్జాకు పాల్పడి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు నిర్ధారించి చర్యలు చేపట్టారు.
భీమన్నదొరపాలెంలో..
ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం పరిధి సర్వే నంబర్ 156లో పీలా ఆక్రమణలో ఉన్న సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆదివారం విశాఖ ఆర్డీవో పెంచల కిషోర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఆ భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఆ భూమిని ఆనుకొని ఉన్న డీ పట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు మరో 100 ఎకరాల వరకు ఆక్రమించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు రెవిన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.
డీ పట్టా భూములపై కన్ను
పీలా గోవిందు తండ్రి మహాలక్ష్మి నాయుడు టీడీపీ నాయకుడే. ఆయన పెందుర్తి మండలాధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచే భీమన్నదొరపాలెంలో డీ పట్టా భూములపై కన్నేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఆ భూములను సక్రమం చేసుకునేందుకు గోవిందు 2014 సంవత్సరంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖలో భూఆక్రమణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనూ ఈ అక్రమాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక ఆనందపురం మండలంలోనే రామవరం గ్రామంలో 99.89 ఎకరాల ప్రభుత్వ భూమి చేతులు మారిన వ్యవహారంలో గోవిందుతో పాటు మరో 11 మందిపై పోలీసులు గతంలో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బొత్స బంధువుల అక్రమ నిర్మాణం తొలగింపు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులకు చెందిన రేకుల షెడ్డును ఆదివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. విశాఖ శివారు రుషికొండ పరిధిలో సర్వే నంబర్ 19లో ఏడు సెంట్ల విస్తీర్ణంలో ఒక షెడ్డు, రెండు సెంట్ల విస్తీర్ణంలో మరొక రేకుల షెడ్డు గెడ్డ పోరంబోకు భూమిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేశారు. అయితే ఆ నిర్మాణాల్లో రెండు సెంట్ల విస్తీర్ణంలో ఉన్నది మాత్రమే తమ బంధువులకు చెందినదని మంత్రి బొత్స ఫోన్‌లో ‘సాక్షి’కి వివరించారు. విశాఖలో అక్రమ నిర్మాణాలు ఏవైనా తొలగించాలని, తన బంధువులదైనా ఉపేక్షించవద్దని తాను ఆదివారం స్వయంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
వెలగపూడి కబ్జా పర్వం
ఎమ్మెల్యే వెలగపూడి రుషికొండ ప్రధాన రహదారిని ఆనుకొనే కబ్జా పర్వం నడిపించారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలో సర్వే నంబర్ 21లోని సుమారు రూ.2 కోట్ల విలువైన 6 సెంట్ల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలగపూడి ఆక్రమించారు. అందులో రేకుల షెడ్డు, ప్రహరీ నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గెడ్డ పోరంబోకు స్థలంగా గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం ఆయా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment