సీబీఐ విచారణకు సిద్ధమా?
ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
- సీబీఐ అయితేనే మంత్రి నారాయణ పాత్ర బట్టబయలవుతుంది
సాక్షి, అమరావతి: ‘పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. తప్పులను కట్టడి చేయాలనే తపన ఉండాల్సిన ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి మంత్రులను రక్షించడానికి యత్నిస్తున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. నాలుగు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది.
ప్రశ్నాపత్రాల లీకేజీపై మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు.. వారు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కవ్వించినా జగన్ సంయమనం కోల్పోలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలను విసురుతూ.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు.వివిధ అంశాలను ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు.
నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ను..
సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన జగన్ ‘‘చంద్రబాబు తరచూ నా చదువులు గురించి మాట్లాడుతారు.. నీ మాదిరిగా నేను వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడలేను.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివాను.. పదో తరగతిలో.. ఇంటర్మీడియట్‌లో.. డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ను. నీ మాదిరిగా ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు చెప్పుకోను. నీ మాదిరిగా పీహెచ్‌డీ డీస్‌కంటిన్యూ చేయలేదు.. ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీషు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే మాట్లాడగలరని పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.. నీ ఇంగ్లీషు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసుకో.. ప్రజలను నమ్మించలేకపోతే గందరగోళానికి గురిచేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం.’’ అని ఘాటుగా స్పందించారు.