మహిళలకు నచ్చజెప్పుతున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి
డిమాండ్ సాధనలో గ్రామస్తుల బైక్‌ర్యాలీ
సీఎంను కలిసేందుకు ప్రయత్నం
నారాయణరావుపేటలోనే అడ్డుకున్న పోలీసులు
సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణరావుపేటలో చేపట్టిన సామూహిక రిలే దీక్షలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రజలంతా ఏకమై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లి నారాయణరావుపేటను మండలం చేయాలని డిమాండ్ చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకొని బైక్‌లపై ఎర్రవల్లికి బయలుదేరారు. గ్రామంలోనే పలువురిని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకోవడంతో మహిళలు నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు నారాయణరావుపేటను మండలంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణరావుపేట మండలం కోసం 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు.
గ్రామస్తులందరం సీఎం కేసీఆర్ కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మండలం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను అమలు చేయాలని ప్రజలు కోరితే పట్టించుకోకుండా ఉండడం దారుణమన్నారు.
అంతకు ముందు గ్రామం నుంచి సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిన పలువురిని జగదేవ్‌పూర్ మండలం గణేష్‌పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మునిగెల కిష్టయ్య, మాజీ సర్పంచ్ రంగాగౌడ్, మండల పోరాట సమితి నాయకులు రమేష్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.