narayanaraopeta
-
మండలం కోసం సీఎం వద్దకు..
హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు సిద్దిపేట రూరల్: నారాయణరావు పేటను మండలం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారం నాటికి 34వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు గ్రామ నాయకులు, మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు హైదారాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినతి పత్రాన్ని క్యాంపు కార్యాలయంలోని భద్రతా సిబ్బందికి అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ బందారం రాజమణి రంగాగౌడ్, ఎంపీటీసీ మునిగెల కిష్టయ్య, మండల పోరాట సమితి నాయకులు జిల్లెల్ల రమేష్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నారాయణరావుపేటను మండలం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. సుమారు 200మంది గ్రామస్తులు మండలం చేయాలని సీఎం కేసీఆర్ కార్యాలయం వద్దకు వస్తే.. పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ మేరకు నారాయణరావుపేటను మండలం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతకు ముందు సీఎం కార్యాలయం ఎదుట ఉదయం నుంచి కూర్చున్నప్పటికీ సీఎంను కలిసేందుకు పోలీసు సిబ్బంది నిరాకరించి, అక్కడినుంచి పంపించేసిట్లు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో మండల పోరాట సమితి నాయకులు భాస్కర్, గణేష్, దేవరాజు, రత్నాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మహిళ సంఘాల నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు. -
మండలం కోసం రగడ
డిమాండ్ సాధనలో గ్రామస్తుల బైక్‌ర్యాలీ సీఎంను కలిసేందుకు ప్రయత్నం నారాయణరావుపేటలోనే అడ్డుకున్న పోలీసులు సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణరావుపేటలో చేపట్టిన సామూహిక రిలే దీక్షలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రజలంతా ఏకమై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లి నారాయణరావుపేటను మండలం చేయాలని డిమాండ్ చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకొని బైక్‌లపై ఎర్రవల్లికి బయలుదేరారు. గ్రామంలోనే పలువురిని రూరల్ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకోవడంతో మహిళలు నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు నారాయణరావుపేటను మండలంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణరావుపేట మండలం కోసం 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. గ్రామస్తులందరం సీఎం కేసీఆర్ కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మండలం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను అమలు చేయాలని ప్రజలు కోరితే పట్టించుకోకుండా ఉండడం దారుణమన్నారు. అంతకు ముందు గ్రామం నుంచి సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిన పలువురిని జగదేవ్‌పూర్ మండలం గణేష్‌పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మునిగెల కిష్టయ్య, మాజీ సర్పంచ్ రంగాగౌడ్, మండల పోరాట సమితి నాయకులు రమేష్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని పోరు
నారాయణరావుపేట మండల కోసం దీక్షలు 23 రోజులుగా నిరసనలు సీఎం, మంత్రి హరీశ్ హామీ నిలబెట్టుకోవాలంటున్న స్థానికులు సిద్దిపేట రూరల్: నారాయణరావుపేటను మండల కేంద్రం చేసేంత వరకు తమ పోరు ఆగదని ఈ ప్రాంత వాసులు హెచ్చరిస్తున్నారు. నారాయణరావుపేట మండలం కోసం గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన సామూహిక రిలే దీక్షలు ఆదివారం నాటికి 23వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్షలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నారాయణరావుపేటను మండలం చేస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అలాగే మంత్రి హరీశ్‌రావు సైతం పలు సందర్భాల్లో గ్రామాన్ని మండలం చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఏర్పడగానే నారాయణరావుపేటను మొట్టమొదటిగా మండలం చేస్తానని అప్పట్లో మంత్రి ప్రజలకు చెప్పారన్నారు. దీంతో కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావులు ఇచ్చిన హామీ మేరకు మండలం కోసం ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. నారాయణరావుపేట భౌగోళికంగా, జనాభా ప్రతిపాదికగా అన్ని విధాలా మండలానికి అర్హత ఉందన్నారు. కానీ, హామీలను మరిచి ముసాయిదా నోటిఫికేషన్లో నారాయణరావుపేటను చేర్చక పోవడం దారుణమన్నారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో నారాయణరావుపేట గ్రామ వాసులం క్రియాశీలకంగా పని చేశామన్నారు. స్వరాష్ట్రంలో తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో గ్రామ నాయకులు గుండుకాడి నరేష్, మల్లేశం, దండు బాబు, రమేష్, రాజు, దీలిప్, సురేష్, సుధాకర్, బాబేషఠ్, దేవేందర్, కమల్ తదితరులు పాల్గొన్నారు.