నారాయణరావుపేటలో దీక్ష
- నారాయణరావుపేట మండల కోసం దీక్షలు
- 23 రోజులుగా నిరసనలు
- సీఎం, మంత్రి హరీశ్ హామీ నిలబెట్టుకోవాలంటున్న స్థానికులు
సిద్దిపేట రూరల్: నారాయణరావుపేటను మండల కేంద్రం చేసేంత వరకు తమ పోరు ఆగదని ఈ ప్రాంత వాసులు హెచ్చరిస్తున్నారు. నారాయణరావుపేట మండలం కోసం గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన సామూహిక రిలే దీక్షలు ఆదివారం నాటికి 23వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్షలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నారాయణరావుపేటను మండలం చేస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
అలాగే మంత్రి హరీశ్‌రావు సైతం పలు సందర్భాల్లో గ్రామాన్ని మండలం చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఏర్పడగానే నారాయణరావుపేటను మొట్టమొదటిగా మండలం చేస్తానని అప్పట్లో మంత్రి ప్రజలకు చెప్పారన్నారు. దీంతో కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావులు ఇచ్చిన హామీ మేరకు మండలం కోసం ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు.
నారాయణరావుపేట భౌగోళికంగా, జనాభా ప్రతిపాదికగా అన్ని విధాలా మండలానికి అర్హత ఉందన్నారు. కానీ, హామీలను మరిచి ముసాయిదా నోటిఫికేషన్‌లో నారాయణరావుపేటను చేర్చక పోవడం దారుణమన్నారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో నారాయణరావుపేట గ్రామ వాసులం క్రియాశీలకంగా పని చేశామన్నారు. స్వరాష్ట్రంలో తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందన్నారు.
ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో గ్రామ నాయకులు గుండుకాడి నరేష్, మల్లేశం, దండు బాబు, రమేష్, రాజు, దీలిప్, సురేష్, సుధాకర్, బాబేషఠ్, దేవేందర్, కమల్ తదితరులు పాల్గొన్నారు.