mandal centre
-
బేతవోలు గ్రామాన్ని మండల కేంద్రం చెయ్యాలి
బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో గల మేజర్ గ్రామ పంచాయతీ. 2014లో సమగ్ర కుటుంబ సర్వేనాటికి 10,500 మంది జనాభా ఈ ఊళ్లో ఉందని తేలింది. ఏడాదికి రెండు సార్లు వరి సాగుచేస్తూ వివిధ ప్రాంతాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ గ్రామంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. మొదటి ప్రతాపరుద్రుడి (12వ శతాబ్దం) సామంత రాజు బేతిరెడ్డి పేరుమీదుగా అప్పట్లో బేతిప్రోలు అనే గ్రామం ఏర్పడింది. అదే నేటి బేతవోలుగా మారిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఈ గ్రామంలో ఉన్న ‘వీర్లదేవి చెర్వు’ (పెద్ద చెర్వు) ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా నిలిచింది. బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వంటివారు ఈ గ్రామం సందర్శించి కల్లు వ్యతిరేక ఉద్యమం, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేశారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బేతవోలు చురుకుగా పాల్గొంది. ఇంతటి ఘన చరిత్ర, భౌగోళిక అనుకూలతలు ఉన్న బేతవోలు గ్రామం నేటికీ మండల కేంద్రం కాలేకపోయింది. బేతవోలు కంటే భౌగోళికంగా, జనాభా పరంగా అతి చిన్న గ్రామాలు మండలాలుగా మారినప్పటికీ... ఈ గ్రామం మాత్రం ఇప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీగానే మిగిలివుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడూ బేతవోలు మండల కేంద్రం అవుతుందనే ప్రచారం జరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణం గ్రామానికి అనుసంధానంగా పట్టణ రహదారులు లేవని చెబుతున్నారు. కానీ బేతవోలు... మిర్యాలగూడెం నుండి కోదాడ నియోజకవర్గానికి మారిన తర్వాత బరాఖత్ గూడెం జాతీయ రహదారి నుండి రాయినగూడెం వరకు... మిర్యాలగూడ రహదారిని కలుపుతూ బీడీ రోడ్డు వేశారు. (క్లిక్: ఇది రైతుల పాలిట వరమా... శాపమా?) బేతవోలు గ్రామానికి చుట్టుపక్కల కేవలం ఐదుకిలోమీటర్ల దూరంలోనే పది నుండి పదిహేను గ్రామాలు ఉన్నాయి. ఈ అనుకూలతలను చూపిస్తూ 2016–17లో గ్రామ ప్రజలు మండల కేంద్రంగా చేయాలని ధర్నాలు చేశారు. అధికార్లు, ఎమ్మేల్యేలకు మెమొరాండాలిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా బేతవోలును మండల కేంద్రం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. – వరకుమార్ గుండెపంగు (‘మావూరు బేతవోలు’ నవలా రచయిత) -
త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం
జైనథ్ : మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్‌శాఖ ఏడీఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, నీడకోసం చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులను న్యాయం జరిగేలా కూపన్లు జారీ చేసి తేదీల వారీగా కొనుగోలు చేపట్టాలన్నారు. దళారులకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, ఏఎంపీ వైఎస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, నాయకులు గంభీర్ టాక్రే, పూండ్రు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఏఎంసీ కార్యరద్శి శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వివేక్ పాల్గొన్నారు. -
పరీక్షలకు దూరం..!
బేల(ఆదిలాబాద్) : దూరభారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షగా మారింది. ఫలితంగా ఉన్నత విద్యను అర్ధంతరంగా ముగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మారుమూల సరిహద్దు మండలం బేల. ఉన్నత విద్య కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని బేలకు వచ్చి ఇక్కడి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక ప్రముఖుల చొరవతో 2014–15లో మండల కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. గతంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారు, రెగ్యులర్ విద్యార్థులు ఇక్కడే ప్రవేశాలు పొందుతున్నారు. ఇంగ్లిషు మీడియం అయినప్పటికీ సమీపంలో ఉండడంతో మరాఠీ, గిరిజన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. 220 మంది డిగ్రీ విద్య అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా.. ఇబ్బందులను అధిగమించి వస్తున్నారు. పరీక్షల కోసం జిల్లా ఆదిలాబాద్‌లోని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ప్రభుత్వం సెమిస్టర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఒక విద్యా సంవత్సరంలో కచ్చితంగా రెండు పరీక్షలు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజు పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి రావడానికి ఎంతో సమయం పడుతోంది. గ్రామాల నుంచి విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాలేక చదువును అర్ధంతరంగా మానేస్తున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారి సంఖ్య 120 ఉండగా.. 2016–17లో 100కు తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో 58 పడిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంఖ్య సైతం 100కు తగ్గింది. నిర్మల్ జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలకు అనుమతి.. మారుమూల మండల కేంద్రాల్లో ప్రైవేటు డిగ్రీ కళశాలలు ఉన్న చోట కాకతీయ యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలకు స్థానికంగా అనుమతి ఇస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్మల్ జిల్లాలోని కల్లూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళశాలకు సమీప ప్రభుత్వ జెడ్పీఎస్‌ఎస్‌లో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. లక్ష్మణచాందలోని కళశాలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళశాలలో పరీక్ష కేంద్రం అనుమతి లభించింది. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి యూనివర్సిటీ అధికారులు బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, పోషకులు కోరుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయిన. మాది కూలీ కుటుంబం. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఉన్నదని, ఇష్టపడి చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి ఇక్కడి రావాలంటే ఎటువంటి వాహనాలు ఉండవు. చదువుకోవాలని ఆసక్తితో రెండు కిలోమీటర్లు కాలినడకన వస్తున్నాను. ఆదిలాబాద్‌కు వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయినా. ఇప్పుడు నా చదువు అర్ధంతరమేనో.– కైరి అశ్విని, బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరం, మోహబత్పూర్ నాన్నతో కలిసి పరీక్షలకు.. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి ప్రతి రోజు నాన్నతో కలిసి వెళ్లాను. నా స్నేహితులు వారి కుటుంబ సభ్యుల తోడు లేకపోవడంతో ఈ పరీక్షలు రాయడానికి రాలేదు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– మరప అశ్విని, బీకాం మొదటి సంవత్సరం, బెల్లూరిగూడ పరీక్ష కేంద్రం కోసం ప్రయత్నిస్తున్నాం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కళశాలకు సమీపంలో మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. భాష, రవాణా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం సెమిస్టర్ విధానంతో రెండు సార్లు పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లలేక విద్యార్థులు చదువు అర్ధంతరంగా మానేయడం బాధగా ఉంది. స్థానికంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– వరప్రసాద్‌రావు, కీర్తన డిగ్రీ కళశాల బేల -
ఆగని పోరు
నారాయణరావుపేట మండల కోసం దీక్షలు 23 రోజులుగా నిరసనలు సీఎం, మంత్రి హరీశ్ హామీ నిలబెట్టుకోవాలంటున్న స్థానికులు సిద్దిపేట రూరల్: నారాయణరావుపేటను మండల కేంద్రం చేసేంత వరకు తమ పోరు ఆగదని ఈ ప్రాంత వాసులు హెచ్చరిస్తున్నారు. నారాయణరావుపేట మండలం కోసం గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన సామూహిక రిలే దీక్షలు ఆదివారం నాటికి 23వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్షలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నారాయణరావుపేటను మండలం చేస్తానని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అలాగే మంత్రి హరీశ్‌రావు సైతం పలు సందర్భాల్లో గ్రామాన్ని మండలం చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ఏర్పడగానే నారాయణరావుపేటను మొట్టమొదటిగా మండలం చేస్తానని అప్పట్లో మంత్రి ప్రజలకు చెప్పారన్నారు. దీంతో కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావులు ఇచ్చిన హామీ మేరకు మండలం కోసం ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. నారాయణరావుపేట భౌగోళికంగా, జనాభా ప్రతిపాదికగా అన్ని విధాలా మండలానికి అర్హత ఉందన్నారు. కానీ, హామీలను మరిచి ముసాయిదా నోటిఫికేషన్లో నారాయణరావుపేటను చేర్చక పోవడం దారుణమన్నారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో నారాయణరావుపేట గ్రామ వాసులం క్రియాశీలకంగా పని చేశామన్నారు. స్వరాష్ట్రంలో తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో గ్రామ నాయకులు గుండుకాడి నరేష్, మల్లేశం, దండు బాబు, రమేష్, రాజు, దీలిప్, సురేష్, సుధాకర్, బాబేషఠ్, దేవేందర్, కమల్ తదితరులు పాల్గొన్నారు.