ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలి
ఏయూక్యాంపస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సత్వరమే ప్రత్యేక హోదాను ప్రకటించాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఏయూ మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన అనంతరం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఏపికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. రాయితీతో కూడిన పరిశ్రమలు స్థాపన ఫలితంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. తెలుగు దేశం పార్టీకి చిత్తశుద్ది ఉంటే ప్రత్యేక హోదాను కోరుతూ కేంద్ర మంత్రి మండలి నుంచి వెంటనే వైదొలగాలన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ అన్ని పార్టీలు రాజ్యసఖకు మద్దతు అందించాలన్నారు. ప్రత్యేక హోదా అదించినపుడే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. రాజధాని నిర్మాణానిక అవసరమైన నిధులను కేంద్రం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ అద్యక్షుడు రాజ్‌కమల్, రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్ బాబు, టి.సురేష్ కుమార్, యం.సురేష్, సంయుక్త కార్యదర్శి కె.ధీరజ్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర యాదవ్, విద్యార్థి నాయకుడు ఆళ్ల స్వామి, గణపతి, నాని, ఈశ్వరరావు, రాధా, అశోక్ బాబు, చందు, సత్యం తదితరులు పాల్గొన్నారు.