లేదంటే ఇంటికే!
పాఠాలు చెబితేనే ఉంటారు..
పలువురు ఉపాధ్యాయులకు డీఈవో హెచ్చరిక
ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు
అవనిగడ్డ:
పిల్లలకు పాఠాలు చెప్పడానికే మీరు పనిచేస్తోంది. పదో తరగతి విద్యార్థులు త్రికసం«ధి, హిమాలయాలు ఎక్కడున్నాయో, పదార్థాలు ఎన్నిరకాలో చెప్పలేక పోతున్నారు. ఇదేనా మీరు చెప్పే చదువులు, పాఠాలు చెబితేనే ఉంటారు. లేదంటే ఇంటికి పంపించేస్తానని డీఈవో ఏ సుబ్బారెడ్డి పలువురు ఉపాధ్యాయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం డీఈవో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు.
నిన్ను సస్పెండ్ చేసేస్తా?
తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను త్రిక సంధి చెప్పమనగా ఒక్కరూ సమాధానం చెప్పలేదు. ఆగ్రహించిన డీఈవో పదోతరగతి వరకూ వచ్చారు త్రిక సంధి తెలియదా? ఇంత బాగా చెబుతున్నారు మీ మాస్టార్ అన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌ని పిలిచి నీవు ఎప్పుడు ఉద్యోగంలో చేరావని ప్రశ్నించారు. 2012 డీఎస్సీకి వచ్చానని సమాధానం ఇచ్చారు. రేపో, ఎల్లుండో రిటైర్ అయ్యేవాడిలా చదువులు చెప్పడానికి అంతబద్ధకం ఎందుకు, నిన్ను సస్పెండ్ చేసేస్తాని డీఈవో హెచ్చరించారు.
నోటు పుస్తకాలు దిద్దడం లేదు..
పదోతరగతి మూడు గదులను డీఈవో పరిశీలించారు. ప్రతి ఒక్క విద్యార్థిని పలుకరిస్తూ అన్ని సబ్జెక్టు నోటు పుస్తకాలను చూశారు. నోట్సు బాగానే రాస్తున్నారు. టీచర్లే దిద్దడం లేదు. హిందీ, లెక్కలు, పీఎస్, తెలుగు, సోషల్ నోట్స్ ఉపాధ్యాయులు దిద్దలేదు. ఇంగ్లిషు, ఎన్‌ఎస్ నామమాత్రంగా చూశారు. ఇలా అయితే ఎలా? రేపు పరీక్షల్లో తప్పులు రాస్తే ఎవరు బాధ్యులని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. డీఈవో ప్రతిసారీ వచ్చి విజిట్ చేస్తారా? ఎన్నని చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన డీఈవో సుబ్బారెడ్డి వంట బాగుందని కితాబిచ్చారు.
మెమోలు ఇవ్వాలని ఆదేశం..
పాఠాలు చెప్పని, నోట్స్ చూడని తెలుగు, సోషల్, పీఎస్ ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వాలని ఎంఈవో ఎన్ శివశంకరరావును డీఈవో ఆదేశించారు. మళ్లీ వస్తాను అప్పటికీ మారకపోతే ఇంటికెళ్లి పోతారని హెచ్చరించారు. భవిత సెంటర్‌ను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలని జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కోరారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీబీఎం బోర్డింగ్ స్కూల్‌ని పరిశీలించారు. టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చినిగిపోయి ఉండటాన్ని గమనించిన డీఈవో దీనిని రోడ్డుపై పారేయండి. రిజిస్టర్ కూడా సరిగా ఉంచుకోలేరా అని హెచ్‌ఎం సరళాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర గల స్కూల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ, హెచ్‌ఎం ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.