హంద్రీనీవా.. కన్నీటి తోవ | details on distributory of handriveeva canal | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా.. కన్నీటి తోవ

Published Fri, Sep 8 2017 3:55 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

హంద్రీనీవా.. కన్నీటి తోవ - Sakshi

హంద్రీనీవా.. కన్నీటి తోవ

డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లొదిలే కుట్ర
- ఇప్పటికే 2015లో జీఓ జారీ
- తెరపైకి లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌
- ఉరవకొండలో 20వేల హెక్టార్లకు రూ.899 కోట్లు కేటాయింపు
- ఇందులో 50 శాతం నిధులతో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యే అవకాశం
- ప్రభుత్వ తీరుతో రైతుల్లో గందరగోళం


రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతును దగా చేస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు ఏడాదిలో నీరిస్తామని 2014లో హామీ.. ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు తీయొద్దని 2015లో జీఓ.. 2016 ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్‌ఈ, సీఈలతో ప్రకటన.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూమి సమతులంగా లేదని.. లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకొస్తున్నామని కొత్త పల్లవి. మొత్తంగా రూ.899 కోట్లకు ‘టెండర్‌’ పెడుతూ అస్మదీయులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షిప్రతినిధి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45లక్షల ఎకరాల ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫేజ్‌–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే వీలుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో హంద్రీనీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు. 2015 ఫిబ్రవరిలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి.

ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్‌(ఇంజనీరింగ్‌ ప్రాజñక్టు ఇండియా లిమిటెడ్‌), 34ను ఆర్‌వీసీపీఎల్‌(రెడ్డివీరన్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వి.. ఆ పరిధిలో ఉప, పిల్లకాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కారణమేంటని ఆరా తీస్తే.. 5–6 కిలోమీటర్‌ మధ్య రాయి ఉంది. బ్లాస్టింగ్‌ చేయాలని అధికారులు చెప్పగా.. దీన్ని పక్కనపెట్టడంతో పాటు మేజర్‌ కెనాల్‌లోని కల్వర్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి.

ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు మరోమాట చెప్పారు. 34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. ఇందులో డీ–1, 8.25, డీ–2. 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకు బ్రేక్‌ పడింది. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. నిజానికి కొత్తరేట్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాబట్టి పనులు చేస్తే ఏజెన్సీలకు ఎలాంటి నష్టం రాదు.. లాభం తప్ప. వీటితో పాటు 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336కోట్లు కేటాయిస్తూ దీనికి గతేడాది ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

సమతులం పేరుతో డిస్ట్రిబ్యూటరీలను తప్పించే ఎత్తుగడ
ఉరవకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ లిఫ్ట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌(సీఎల్‌ఐడీ) పథకం పేరుతో రూ.899కోట్లు కేటాయిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్యాకేజీల్లో భూభాగం సమతులంగా లేకపోవడంతో 11,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంది. అంటే ఈ ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేయమని చెప్పకనే చెప్పినట్లయింది. అలాగే ఈ ఆయకట్టుకు నీరిందంచడానికి కేటాయించిన 1.45టీఎంసీలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలు చేయడం వల్ల మిగిలే 0.24 టీఎంసీలు కలిపి 1.69టీఎంసీలతో 20వేల హెక్టార్లకు అందిస్తామని పేర్కొంది. ‘ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు.. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. అప్పుడే 0.24 టీఎంసీలు మిగిలాయని ప్రభుత్వం ఎలా చెబుతుందో అంతుపట్టని పరిస్థితి. జీఓలో పేర్కొన్న అంశాలు, 33, 34 ప్యాకేజీల పురోగతి పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటరీలను పక్కనపెట్టినట్టే అనేది సుస్పష్టమవుతోంది.

ఆయకట్టు స్థిరీకరిస్తేనే నీటిపై హక్కు
ఫేజ్‌–1లో 1.18 లక్షల ఎకరాలకు హంద్రీ–నీవాపై హక్కు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలి. అప్పుడే ఈ నీటిపై రైతులకు హక్కు వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్‌, డ్రిప్‌ అంటూ డిస్ట్రిబ్యూటరీని పక్కనపెడితే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. దీంతో నీటిపై రైతులు హక్కును కోల్పోతారు. పైగా లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌కు రూ.899కోట్లు కేటాయించారు. ఫేజ్‌–1లో పూర్తిగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసినా అందులో 50శాతం నిధులు కూడా ఖర్చు కావు. ‘అనంత’లో సాగునీరు అందక, ఏటా రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

డిస్ట్రిబ్యూటరీలతోనే చట్టబద్ధమైన హక్కులు
చట్టబద్ధమైన హక్కులు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలు తప్పనిసరి. లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా ఇస్తే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. రైతులకు హక్కు ఉండదు. దీనికి రూ.900కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.20వేల ఎకరాలకు నీరిస్తామంటున్నారు. ఇందులో 50శాతం లోపు ఖర్చు చేస్తే ఫేజ్‌–1లోని రూ.1.18లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. ఆపై లిఫ్ట్‌, డ్రిప్‌ అంటే నమ్మొచ్చు. డిస్ట్రిబ్యూటరీని పక్కనపెట్టి ఈ చర్యలకు ఉపక్రమిస్తే నిధులు దండుకునే ఉద్దేశం మినహా మరొకటి కాదు.
– రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి

నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వని దౌర్భగ్యపు ప్రభుత్వం ఇదే..
హెచ్చెల్సీ ద్వారా 10, హంద్రీనీవా ద్వారా 34 కలిపి గతేడాది 44టీఎంసీల నీళ్లు వచ్చాయి. వీటితో 5–6లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. కానీ డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా ఎకరాకు కూడా నీళ్లివ్వని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదే. డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా 0.24 టీఎంసీ మిగిలింది. వీటితో కలిపి 1.69టీఎంసీలను డ్రిప్‌ ద్వారా ఇస్తామంటున్నారు. దీనికే మిగులు జలాలు అని ఆలోచిస్తే పేరూరు, బీటీపీకి అవసరమయ్యే 5–10 టీఎంసీలను ఎలా కేటాయిస్తారు. మోసం చేయడం, డబ్బులు దండుకోవడం మినహా మరొకటి కాదు. ఆయకట్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుకు మేమే హారతి పట్టేవాళ్లం. జలహారతి అవసరం లేదు.
– అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement