హంద్రీనీవా నీటి వినియోగంపై ఆంక్షలు
- నీటిని పొలాలకు మళ్లించుకోరాదని హెచ్చరికలు
- పోలీసు బందోబస్తుతో పంట పొలాల్లో దాడులు
ఉరవకొండ :
హంద్రీనీవా ద్వారా నాలుగేళ్ల నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నా ప్రతిపాదిత ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. పొలాల పక్కనే నీరు పోతున్నా వాటిని మళ్లించుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
హంద్రీనీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.అందులో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలు ఉంది. మొదటి దశలో 30 నుంచి 36 ప్యాకేజీ వరకు ఉన్నాయి. అందులో నియోజకవర్గంలో 33 ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు ఉన్నాయి.
హంద్రీనీవా నీటివాడకంపై అధికారుల కొరడా :
ఉరవకొండ నియోజవర్గంలో ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుతడి పంటలైన మిర్చి, వరి,ప్రత్తి పంటలు సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మోటార్లు, పైపులు కొనుగోలు చేశారు. పంటలకు కనీసం రెండు తడులైనా నీరు అందించాలని హంద్రీనీవా నీటిని వాడుకుంటున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో అధికారులు ఉన్నఫలంగా మోటార్లతో నీటిని వాడుకుంటే చర్యలు తీసుకుంటామని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల పరిధిలోని కాలువ పొడువునా దాడులు చేయడానికి చర్యలు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోని కడమలకుంట, రాగులపాడు, పీసీ ప్యాపిలి, ఉరవకొండ మండలంలోని లత్తవరం, చిన్నమూస్టురు, పెద్దమూస్టురు, ఇంద్రావతి గ్రామాల్లో ఇప్పటికే రైతులను అధికారులు మోటార్లు పెట్టుకోరావని హెచ్చరించారు. అధికారుల తీరుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హక్కుగా వాడుకోవాల్సిన హంద్రీనీవా నీటిపై ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పంటలు పరిస్థితి ఎంటీ : నాగరాజు, రాయంపల్లి
కొద్దో గొప్పో హంద్రీనీవా నీటితో పంటలకు నీరు అందుతుంది. ఇప్పడు మోటార్లు పెట్టి వాడుకోరాదు అంటే పంటలు పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. అధికారులు రైతుల గురించి ఆలోచించాలి.
మా వాటా నీరు ఇవ్వండి : లక్ష్మినారాయణ, ఆయకట్టు రైతు
హంద్రీనీవా నీరు మాకు రావాల్సిన హక్కు. ఆయకట్టుకు నీరు ఇచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి, ఇప్పుడు మోటార్లు పెట్టరాదంటూ అధికారులు చెప్పడం సరైంది కాదు.
ఒక తడి ఇస్తే పంట చేతికొస్తుంది : గోవిందు, రైతు
ప్రస్తుతం ఒక్క తడి నీరు అందితే మిర్చి పంట చేతికందే అవకాశం ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఎంతో ఆశగా పంట చేతికొస్తుందని ఎదురుచూస్తున్నాం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : బ్రహ్మయ్య, తహసీల్దార్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిబంధన అమలు చేస్తున్నాం. రైతులు ఎవ్వరు హంద్రీనీవా నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకోరాదు. రైతులు అధికారులకు సహకరించాలి.