పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
Published Wed, Nov 9 2016 9:54 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
ప్యాపిలి: అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు జక్కల చెరువు మధును శిక్షించాలని బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు ధర్నా చేశారు. ఈ నెల 2వ తేదీన బాలికపై అత్యాచారం జరగగా..7వ తేదీన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం ప్యాపిలి గ్రామప్రజలు అక్కడికి చేరుకున్నారు. నిందితుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో తప్పుగా నమోదు చేసి కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. ఓ దశలో స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అనంతరం వారు అక్కడి నుంచి పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నిందితున్ని కఠినంగా శిక్షించేవరకు ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించారు. గతంలోనూ నిందితుడు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినట్లు మహిళలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పారు. తిరిగి సాయంత్రం పెద్ద సంఖ్యలో మహిళలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నిందితుడితోపాటు ఓ మహిళ స్టేషన్‌లోనే ఉన్నారని తెలుసుకున్న మహిళలు మరో సారి రోడ్డుపై బైఠాయించారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో .. సీఐ ప్రసాద్ తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. నిందితున్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని సీఐ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Advertisement