పల్లెల్లో విస్తతంగా పెరుగుతున్న రోగులు
డయేరియాతో కేంద్రాస్పత్రిలో ఒకరి కన్నుమూత
పడకలు చాలక వరండాలోనే రోగులకు చికిత్స
అధ్వానంగా గ్రామీణ పారిశుద్ధ్యం
విజయనగరం ఫోర్ట్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రత్యేకంగా నిధులు విడుదల కాక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యాధుల విస్తతికి కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలానూ నిధులు విడుదల చేయకపోగా... కేంద్రం విడుదల చేస్తున్ను నిధులను సైతం పక్కదారి పట్టిస్తుండటంతో మారుమూల ప్రాంతాల్లో అపారిశుద్ధ్యం కారణంగా వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డయేరియా కారణంగా పలువురు కన్నుమూయడం మరువకముందే మరోవ్యక్తి కేంద్రాస్పత్రిలో మరణించాడు.
12 మందికి పైగా రోగులు
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో 12 మందికి పైగా రోగులు డయేరియా బారిన పడ్డారు. వీరిలో 10 మంది కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరి కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అపారిశుద్ధ్యం, కలుషత నీరు వల్లే వ్యాధి వ్యాప్తి చెందినట్టు తెలిసింది. ఈ ఒక్కచోటే కాదు... పూసపాటిరేగ మండలం పేరాపురం, పూసపాటిరేగ, బొండపల్లి మండలం వేండ్రం, గుర్ల మండలం గుజ్జింగ వలస, జామి మండలం శాసనపల్లి ప్రాంతాలకు చెందిన డయేరియా రోగులు సైతం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రోగులు వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుతోంది.
పారిశుద్ధ్య నిధులు పక్కదారి
పల్లెలకు నేరుగా 13, 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాటితో పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, నీటిపథకాల్లో క్లోరినేషన్, కాలువల నిర్మాణం ఇతర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వట్లేదు సరికదా... కేంద్రం ప్రభుత్వం అందించిన నిధులు సైతం వేరే పనులకు మళ్లిస్తుండటంతో పల్లెలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఫలితంగా ఎంతోమంది మత్యువాతపడుతున్నారు. తీరా ఎవరైనా చనిపోయాకే పాలకులు హడావుడి చేస్తున్నారు. వైద్యాధికారులను అక్కడకు పంపించడం... అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించడం చేస్తున్నారు. నేరుగా ముందస్తుగానే పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు నిధులు విడుదలైతే ఈ పరిస్థితి తలెత్తేది కాదుకదా అన్నదే ప్రశ్న.
పీహెచ్‌సీల్లో మందుల కొరత
పల్లెవాసులకు అందుబాటులో ఉంటున్న పీహెచ్‌సీల్లో మందులు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమయింది. దీంతో పల్లెలనుంచి సైతం రోగులు అంతా విజయనగరంలోని కేంద్రాస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా రోజుకు 30 నుంచి 40 మంది వరకు రోగులు ఇక్కడకు వస్తున్నారు. వీరిలో 15 నుంచి 20 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. ఇక్కడ కూడా పడకలు చాలక వరండాలోని బల్లలపై చికిత్సఅందిస్తున్నారు. డయేరియా వార్డుతో పాటు, సర్జికల్ వార్డులో కొంతభాగాన్ని డయేరియా రోగులకోసం వినియోగిస్తున్నారు. అయినప్పటికీ పడకలు సరిపోవట్లేదు. పీహెచ్‌సీల్లోనే సౌకర్యాలు కల్పిస్తే జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు.
డయేరియాతో ఒకరి మతి
డయేరియా వ్యాధితో బాధ్యపడుతున్న ఓ వ్యక్తి కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మతిచెందాడు. పట్టణంలోని అలకాల గెడ్డకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు అవ్వడంతో కేంద్రాస్పత్రికి 5:30 గంటల ప్రాంతంలో తీసుకు వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ 10 గంటల సమయంలో మతిచెందాడు. దీంతో మిగిలిన రోగుల్లో ఆందోళన మొదలైంది. ఆస్పత్రిలో చేరిన 3నుంచి 4రోజుల వరకు వ్యాధి నయం కాకపోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది.
వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం: డాక్టర్ ఎం. శారద, డీఎంహెచ్‌ఓ
డయేరియా, జ్వరాల వ్యాప్తి ఉన్నందున వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించాం. డయేరియా గాని జ్వరాలు గాని ప్రబలాయని తెలిసిన వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం.