
నందేల సోమయ్య
ఏ ఇంట చూసినా జ్వరపీడితులే
కనీసం పట్టించుకోని వైద్యసిబ్బంది
సంచివైద్యులనే ఆశ్రయిస్తున్న వైనం
సాలూరు:మండలంలో నార్లవలస పంచాయతీ బర్నికవలస గ్రామం జ్వరాలతో మంచం పట్టింది. గ్రామంలోని చోడిపల్లి శాంతమ్మ, జన్ని ప్రమీల, నందేల సోమయ్య తదితర సుమారు 10 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో ఇంతమంది జ్వరపీడితులున్నా... ఉన్న స్థానిక వైద్యులు ఎవ్వరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంటి వద్దనే సంచి వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూ... మంచాలకే పరిమితమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ తదితర ఏ పనలూ చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామానికి ఇటీవల వేసిన గ్రావెల్ రోడ్డు కూడా అస్తవ్యస్థంగా ఉంది. గ్రామంలో ఆవులు, మేకలు అధికంగా ఉండడంతో దోమలు విజంభిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని వారు కోరుతున్నారు. పెద్దవలస గ్రామంలో కూడా పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు.