కిష్టారెడ్డి కుమారుడికే ‘ఖేడ్’ టికెట్
మెదక్ జిల్లా నేతలతో దిగ్విజయ్
♦ షెట్కార్‌కు ప్రచార బాధ్యతలు
♦ ఈనెల 29న నారాయణఖేడ్‌లో భారీ సభ
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికపై చర్చించడానికి ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ టీపీసీసీ, మెదక్ జిల్లా ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. టీపీసీసీ ముఖ్యనేతలు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహా, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, టి.జగ్గారెడ్డి, సురేశ్ షెట్కార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ ఉప ఎన్నికలో కిష్టారెడ్డి తనయుడు సంజీవరెడ్డి పార్టీ అభ్యర్థిగా ఉంటారని ఈ సమావేశంలో దిగ్విజయ్ ప్రకటించారు. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సురేశ్ షెట్కార్ ఈ ఎన్నికల్లో ప్రచారం, గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు. గతంలో కిష్టారెడ్డి, షెట్కార్ ఐక్యంగా పనిచేసినట్టుగానే భవిష్యత్తులోనూ కలిసి పనిచేయాలని దిగ్విజయ్ కోరారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ఉంటే వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడం పెద్దవిషయమేమీ కాదని చెప్పారు.
ఈ నెల 29న సమావేశం
ఈ నెల 29న నారాయణఖేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తలను, నేతలను ఉప ఎన్నికకోసం సమాయత్తం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న సంప్రదాయం ప్రకారం నారాయణఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. దీనికి అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలతో చర్చించడానికి టీపీసీసీ చొరవ తీసుకుంటుందన్నారు. అయితే నారాయణఖేడ్‌లోనే రాష్ట్ర బడ్జెట్‌ను అంతా కేటాయిస్తూ ప్రభుత్వం జీవోలను ఇస్తోందని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలతో టీఆర్‌ఎస్ తీరు అనుమానాలను కలిగిస్తోందన్నారు.
కిష్టారెడ్డి కుటుంబానికి దిగ్విజయ్ పరామర్శ
నారాయణఖేడ్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి భార్య గాళమ్మను మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌లోని నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కిష్టారెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. గాళమ్మతో పాటు, కుమారుడు సంజీవరెడ్డిని వివరాలడిగి తెలుసుకున్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఉన్నారు.
పీసీసీ కార్యవర్గం ఏదీ?
15 రోజుల్లో మొత్తం కమిటీలకు దిగ్విజయ్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మినహా ఆరునెలల నుంచి పూర్తిస్థాయి కార్యవర్గం లేదని పలువురు నేతలు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు మొరపెట్టుకున్నారు. టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో పనివిభజన లేదని, కేవలం ఇద్దరు నాయకులే పార్టీ పనిని ఎలా చేయగలరని ఆయనను ప్రశ్నించారు. దీనికి స్పందించిన దిగ్విజయ్ 15 రోజుల్లో గ్రామ స్థాయి నుంచి టీపీసీసీ దాకా అన్ని కమిటీలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీలకు పూర్తిస్థాయి కమిటీలను వెంటనే నియమించాలని టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కను ఆదేశించారు. టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే తమకు అందించాలని సూచించారు.