అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు
మధ్యలో కొనుగోలుదారులకు ముప్పు
►13 ఏళ్ల క్రితం యథేచ్ఛగా అనుమతులు జారీ
►సర్వే నెంబర్ 329లో అన్నీ ప్రైవేట్ భూములేనని నిర్థారణ
►వాటి ఆధారంగా వందల ప్లాట్ల క్రయవిక్రయాలు
►ఇప్పుడవి సర్కారు భూములంటున్న అధికారులు
► ఖాళీగా ఉన్న ప్లాట్లలో బోర్డుల ఏర్పాటు..
►రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలు
►చేయని తప్పునకు బలైపోయామంటున్న ప్లాట్ల యజమానులు
అది మధురవాడ ప్రాంతం.. అప్పుడే నగరీకరణ ఊపందుకున్న ఆ ప్రాంతంలో ఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయానికి పెట్టింది.. దానికి వుడా అప్రూవల్‌తోపాటు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయి..ఇంకేముంది.. చాలామంది మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు.. అనేకమంది భవంతులు నిర్మించుకొని నివాసం కూడా ఉంటున్నారు.. చిన్నారావులాంటి కొద్ది మంది మాత్రం ఏవో కారణాలతో నిర్మాణాలు చేపట్టలేక.. ప్లాట్లను ఖాళీగా ఉంచేశారు..
ఇదంతా 12 ఏళ్లనాటి మాట. కట్ చేస్తే.. ఇప్పుడు అటువంటి ఖాళీ స్థలాల్లో.. అవి ప్రభుత్వ స్థలాలన్న బోర్డులు వెలిశాయి.. వాటిని చూసి ప్లాట్ల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. మామూళ్ల మత్తులో పడి.. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఇష్టారాజ్యంగా ఏ శాఖకు ఆ శాఖ అనుమతిలిచ్చేయడం వల్లే ఈ అవస్థలన్నది సుస్పష్టం. దీనివల్ల కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిలువునా మునిగిపోతున్నారు.
విశాఖపట్నం: పిల్లి కళ్లు మూసుకున్న చందంగా తయారైంది జిల్లా యంత్రాంగం తీరు. మామూళ్ల మత్తులో జోగే విద్యుత్, వుడా, జీవీఎంసీ అధికారులు మాకు ఫీజులఒస్తే చాలు ఏ భూములకైనా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తాం.. లే అవుట్ అప్రూవ్ చేసేస్తాం.. ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేస్తాం.. అన్న దోరణిలో వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతికి తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమై పోతున్నాయి. తీరా అధికారులు కళ్లు తెరిచి అడ్డుపుల్లలు వేస్తుండటంతో మధ్యలో కొనుగోలుదారులు ఇరుక్కుంటున్నారు.
అప్పుడు అన్నీ ఓకే
మధురవాడ సర్వే నెంబర్ 329లోని 18.36 ఎకరాల భూమిలో శ్రీకృష్ణ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లే అవుట్ అభివృద్ధికి బీఎల్‌పీ నెం.10/2000 కింద వుడాకు దరఖాస్తు చేసింది. దీనికోసం ప్రొసెసింగ్ ఫీజు రూ.74,303, రెన్యూవల్స్ ఫీజు రూ.74,303 చెల్లించింది. ఈ భూమిలో కల్వర్టు, గెడ్డ రక్షణ గోడల నిర్మానానికి మరో రూ.7.41లక్షలను జోన్–1 డీఈ పేరిట చెల్లించింది. దీంతో ఎటువంటి అబ్జక్షన్స్ లేవంటూ వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ 2004 జూన్ 11న లే అవుట్ అప్రూవల్ జారీ చేసింది. 10.98 ఎకరాల్లో 200 నుంచి 250 గజాల విస్తీర్ణం కలిగిన 242 ప్లాట్ల అభివృద్ధికి అనుమతినిచ్చింది.
మిగిలిన భూమిని రహదారి, ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టాలని పేర్కొంది. ఆ మేరకు ప్లాట్లు అభివృద్ధిఛస్త్రష/æ విక్రయించారు. కొనుగోలుదారుల్లో చాలామంది ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకున్నారు. వీటికి జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్స్, కుళాయి కనెక్షన్లు కూడా మంజూరయ్యాయి. ఈపీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్లు జారీ చేసింది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా పలువురికి వివిధ జాతీయ బ్యాంకులు లక్షల్లో రుణాలు కూడా మంజూరు చేశాయి. కాలక్రమంలో భవనాలు, ప్లాట్లు పలు చేతులు మారాయి. ఇదంతా గత పదమూడేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.30వేల పైమాటే. అంటే ఈ లేవుట్‌లోని ప్లాట్స్ విలువ వందకోట్ల పైమాటే.
అమ్ముకుందామంటే..
కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ కాజా రమేష్ తన తండ్రి రిటైర్డ్ ఎఎస్‌ఐ కాజా చిన్నారావుతో కలిసి అప్పటికే రెండుసార్లు చేతులు మారిన ప్లాట్–86లో 200 చదరపు గజాల స్థలాన్ని పలివెల కృష్ణవేణి వద్ద 2012లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే రమేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో ఈ ప్లాట్‌ను అమ్ముకునేందుకు రమేష్ తండ్రి చిన్నారావు బేరం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లినప్పుడు మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేయకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పడంతో హతాశుడయ్యారు. గత నాలుగేళ్లుగా తన ప్లాట్ కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఎన్‌వోసీ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులరిగాలే తిరుగుతూనే ఉన్నారు. చిన్నారావులాగే అన్యాయమైపోయిన చాలామంది న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
న్యాయపోరాటం
ఒకప్పుడు వాటిని ప్రభుత్వ భూములు కావని నిర్థారించిన అధికారులే నేడు అవి ప్రభుత్వ భూములంటూ రిజిస్ట్రేషన్స్‌కు మోకాలడ్డడంపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. లే అవుట్ అప్రూవుల్ సమయంలో అప్పటి ఆర్డీవో ఈ సర్వే నెంబరులో 9.18 ఎకరాలకు వ్యవసాయ భూమి నుంచి మినహాయింపునిస్తున్నట్టు నిర్ధారిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. సర్వే నెం. 298–1,2లతో పాటు 329లో ఉన్న భూములు ఏపీ ల్యాండ్ రిఫారŠమ్స్ యాక్ట్ పరిధిలో లేవని అదే ఆర్డీవో ఎన్‌వోసీ కూడా ఇచ్చారు. తమ వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డుల ప్రకారం అడంగల్‌లో కూడా ఈ సర్వే నెంబర్లలో భూమి వ్యవసాయ భూములు కానీ, ప్రభుత్వానికి చెందిన భూములు కానీ ఈ సర్వే నెంబర్లలో ఎక్కడా లేవని అప్పటి రూరల్ తహశీల్దార్ జగదీష్ ధ్రువీకరించారు. వీటి ఆధారంగా చిన్నారావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా. విచారణ బాధ్యతను జేసీ జి.సృజనకు అప్పగించారు.
60 రోజుల్లో విచారణ చేపట్టాల్సిన రెవెన్యూ అధికారులు సదరు పిటిషన్‌ను గల్లంతు చేయడంతో ఇటీవల మరోసారి తనకు న్యాయం చేయాలంటూ ఆశ్రయించారు. దాంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. అసలు ఇక్కడ ప్రభుత్వ భూములున్నాయా? లేవా? ఏ విధంగా లే అవుట్స్ అప్రూవల్స్ ఇచ్చారు? జీవీఎంసీ, ఈపీడీసీఎల్ వంటి శాఖలు ఏ విధంగా అనుమతులిచ్చాయి? ఈ వ్యవహారం వెనుక రెవెన్యూ అధికారుల హస్తం..ప్రోద్భలం ఏ మేరకు ఉందనే కోణంపై విచారణ చేపట్టారు.
న్యాయం చేయాలి
వుడా లే అవుట్ అప్రూవ్ కావడంతోనే మేం అక్కడ ప్లాట్ కొనుగోలు చేశాం. మా తర్వాత వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఖాళీగా ఉన్న మా భూముల్లోనే ప్రభుత్వ భూములంటూ నోటీసులు పెట్టారు. చట్ట పరంగా అన్ని మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తా.