50 మీటర్ల పరుగు పందెంలో బాలికలు
సకలాంగులకు ఏమాత్రం తీసిపోరు
Published Tue, Sep 27 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
శ్రీకాకుళం న్యూకాలనీ: సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా దివ్యాంగులు అన్నింటా రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మసై్థర్యం కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో బెహరా మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చూపుతున్న దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రీడల్లో రాణిస్తున్నారని, ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షి మహిళలేనని గుర్తు చేశారు.
పోటీలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు
అనంతరం దివ్యాంగుల పరుగు పోటీలను జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలతో కలెక్టర్ ప్రారంభించారు. పోటీలకు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బోసి (బంతి విసరడం) విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు పతకాలు, ప్రసంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బాబూరావు, బీఆర్ ఏయూ రిజిస్ట్రార్ గుంట తులసీరావు, రాష్ట్ర దివ్యాంగుల క్రీడల సహాయ సంచాలకులు సి.రాజశేఖర్, బెహరా మనోవికాస కేంద్రం కార్యదర్శి సీహెచ్ విజయభాస్కరరావు, ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ విజయ్‌భాస్కర్, ఎ.మోహన్‌రాజ్, గీతాశ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement