కరీంనగర్‌ఎడ్యుకేషన్ : కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థల వాహనాల డ్రైవర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో ఐదు రోజుల ఆందోళనకు తెరపడినట్లయ్యింది. మంగళవారం డెప్యుటీ లేబర్ కమిషనర్ గాంధీ తన కార్యాలయంలో సీఐటీయూ నాయకులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు.
-
ఫలించిన ప్రైవేటు డ్రైవర్ల పోరాటం
-
జీతాలు పెంచుతూ యాజమాన్యాల నిర్ణయం
-
కనీస వేతనాల అమలుకు హామీ
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థల వాహనాల డ్రైవర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో ఐదు రోజుల ఆందోళనకు తెరపడినట్లయ్యింది. మంగళవారం డెప్యుటీ లేబర్ కమిషనర్ గాంధీ తన కార్యాలయంలో సీఐటీయూ నాయకులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. డ్రైవర్ల తరఫున డ్రైవర్ల సంఘం బాధ్యులు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్, ప్రైవేట్ విద్యాసంస్థల తరఫున యాదగిరి శేఖర్‌రావు, వి.నరేందర్‌రెడ్డి, కె.సంజీవరెడ్డి, సరోజ, కేశిపెద్ది శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.
సమ్మె నోటీసులో పేర్కొన్న విధంగా డ్రైవర్లకు రూ.9,700తోపాటు డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్య, ఆర్నెల్లకోమారు రెండు జతల దుస్తులు, పీఎఫ్, ఈపీఎఫ్, గుర్తింపుకార్డులజారీ చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. అలాగే కక్షసాధింపు చర్యలకు పాల్పడబోమని, కనీస వేతనాలను ఆగస్టు1 నుంచి అమలు చేస్తామని ఒప్పందం రాసిచ్చారు. చర్చలు సఫలం కావడంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ వ్యాన్స్ డ్రైవర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడికందుల సత్యం, అధ్యక్ష, కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, తాళ్ల కిషన్, అమిరిశెట్టి శ్రీనివాస్, నరేశ్, ఆంజనేయులు, రామస్వామి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.