వారు ఆడిందే ఆట | District Cricket Association Lotha Committee Fund utilization | Sakshi
Sakshi News home page

వారు ఆడిందే ఆట

Published Fri, Sep 8 2017 7:17 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

వారు ఆడిందే ఆట

వారు ఆడిందే ఆట

జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌లో నాటౌట్‌ బ్యాట్స్‌మెన్లు
ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్న పెద్దలు
లోథా కమిటీ సిఫార్సులూ బుట్టదాఖలు
ఇష్టారాజ్యంగా ఏసీఏ నిధుల వినియోగం
ఏకపక్ష సెలక్షన్స్‌తో నష్టపోతున్న ప్రతిభావంతులు


జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌లో కొందరు పెద్దలు ఏళ్లుగా తిష్టవేశారు. ఆంధ్ర క్రికెట్‌ (ఏసీఏ) నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి తమకు అనుకూలమైన వారినే సెలక్షన్‌ చేస్తుండడంతో ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోతున్నారు. జనవరి 1 నుంచి లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వారు మాత్రం తామెప్పటికీ నాటౌట్‌ బ్యాట్స్‌మెన్లమే నంటూ గ్రౌండ్‌ వీడడం లేదు. – అనంతపురం

సప్తగిరి సర్కిల్‌ : క్రికెట్‌... మనదేశంలో ఈ క్రీడ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రంజీకి సెలక్టయినా అటు డబ్బు..ఇటు పేరు వస్తుంది. అందుకే క్రీడాకారులంతా క్రికెట్‌ను ఎంచుకుని తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. క్రికెట్‌కు ఉన్న ఈ క్రేజ్‌ చూసే  క్రీడా సంఘాలూ పుట్టుకువచ్చాయి. ఇపుడు అవే పెత్తనం చేస్తున్నాయి. తాము ఆడిందే ఆటగా నడుచుకుంటున్నాయి.

క్రీనీడకు ‘లోథా’ బ్రేక్‌
ఐపీఎల్‌ సందర్భంగా తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు దేశంలో ఏర్పాటు చేయబడిన కమిటీ లోథాకమిటీ క్రికెట్‌ అసోసియేషన్‌లకు సంబంధించి పలు సూచనలు చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లోథా కమిటీ సిఫారసులు అమలు చేయాలని తీర్పు చెప్పింది.

లోథా కమిటీ ఏం చెప్పిందంటే
ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష, కార్యదర్శి పదవిని చేపట్టడానికి వీల్లేదు.
ఏ పదవిలో అయినా  ఆరేళ్ల మించి ఉండకూడదు.
క్రికెట్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు కానీ ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)కు అనుబంధంగా పనిచేస్తున్న అనంతపురం డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఏడీసీఏ) దీన్ని లోథా కమిటీ సిఫారసులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాంచో ఫెర్రర్‌ 2004 నుంచి 12 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. ఆయనతోపాటు కార్యదర్శి పదవి కూడా ఇదే తీరుగా సాగుతుండగా ఈ ఏడాది మేలో నూతన కార్యదర్శిగా కేఎస్‌ షాహబుద్దీన్‌ను ఎంపిక చేశారు. దీంతోపాటు ఈ సంఘంలోని ఇతర సభ్యులు ఏళ్ల తరబడి అదే కేడెర్‌లో ఉంటూ తమ ఆధిపత్యాన్ని సాగిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారనే ఆరోపణలున్నా యి.

ఏడీసీఏలో చాలా మంది ఏళ్లుగా పాతుకుపోవడాన్ని జిల్లాలోని పలువురు సీనియర్‌ క్రికెటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహించి... జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి తోడ్పడిన చాలామంది సీనియర్‌ క్రీడాకారులు ఉన్నారనీ, వారిని కాదని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి ఆధిపత్యం చలాయించడం పట్ల వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా క్రికెట్‌ సంఘాన్ని ప్రక్షాళన చేసి... కొత్తవారిని తీసుకుంటే క్రికెటర్లకు మేలు జరుగుతుందని పలువురు సీనియర్‌ క్రికెట్‌ క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

స్టేడియం మంజూరైనా...
ధర్మవరం ప్రాంతంలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి పదేళ్ల క్రితం నివేదిక అందించారు. దీనికి అప్పట్లో జిల్లా కలెక్టర్‌ స్థలాన్ని కూడా పరిశీలించారు. అన్ని తతంగాలు పూర్తయిన తర్వాత ఫైలు ఏసీఏకు చేరింది. అయితే జిల్లా క్రికెట్‌ సంఘం నుంచే ఫైలును పంపించాలని ఏసీఏ తనకు అందిన ఫైలును వెనక్కు పంపింది. కానీ జిల్లా క్రికెట్‌ సంఘం ధర్మవరం స్టేడియం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కొందరు పెద్దలు కావాలనే స్టేడియం నిర్మాణానికి అడ్డుపడ్డారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

అంతా ఆర్డీటీ కనుసన్నల్లోనే...
జిల్లాలో క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆర్డీటీ సంస్థ కనుసన్నల్లో సాగుతోంది. ఏడీసీఏ కార్యాలయాన్ని ఆర్డీటీ ప్రధాన క్రీడా మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆరుగురు కోచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కూడా  ఆర్డీటీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆర్డీటీ సంస్థ సొంతంగా మరో 23 మందిని నియామకం చేసుకుంది. జిల్లాలో ఎలాంటి సెలెక్షన్‌ నిర్వహించాలన్నా... క్రికెట్‌ సమావేశం నిర్వహించాలన్నా.... ఆర్డీటీ ఆధ్వర్యంలో సాగుతుంది. ఏసీఏ అందించిన సామగ్రిని సైతం ఆర్డీటీ క్రీడా మైదానంలో వినియోగించుకుంటున్నారని సీనియర్‌ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement