విజయనగరం: గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు ప్రధాన అంశంగా విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇన్‌చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి సారధ్యంలో మండల విద్యాధికారులు 6 బృందాలుగా ఏర్పడి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. 58 పాఠశాలల్ని తనిఖీ చేసి అందులో 19 గుర్తింపు లేనివిగా నిర్థారించారు. వాటిని తక్షణమే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ లింగేశ్వరరెడ్డి సమక్షంలో అమర్ కాన్సెప్ట్ స్కూల్, వెంకటరమణ స్కూల్, బీఎస్‌ఎం స్కూళ్లకు తక్షణ చర్యలుగా తాళాలు వేశారు.
ముందస్తు సమాచారంతో అప్రమత్తం
దాడులు చేస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకొని మరో నాలుగు స్కూళ్లలో యాజమాన్యాలు అనధికార అదనపు తరగతుల విభాలను మూసేశాయి. మూతబడిన పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి రెన్యువల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నవే అధికంగా ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలకు మాత్రమే గుర్తింపు తెచ్చుకొని ఉన్నత పాఠశాల తరగతులను అనధికారికంగా నిర్వహిస్తున్నవి మరికొన్ని ఉన్నాయి.
19 పాఠశాలల్లో పట్టణ పరిధిలోని ప్రసన్న ప్రాధమికోన్నత పాఠశాల, ఆల్ఫా స్కూల్, సరస్వతీ విద్యామందిర్, సాధుసుందరం, గురుదత్తా స్కూల్(కంటోన్మెంట్), ప్రతిభా స్కూల్, రవి స్కూల్, సాయిదుర్గ స్కూల్, సూర్య పబ్లిక్, లివింగ్‌డాల్ స్కూల్, వశిష్ట స్కూల్, విజయనగరం పబ్లిక్ స్కూల్, ఎయిమ్ ప్రైమరీ స్కూల్, విద్యాన్ యూపీ స్కూల్ ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
గుర్తింపులేని స్కూళ్లలో చేరొద్దు
గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను ఎట్టిపరిస్థితుల్లో చేర్పించవద్దని ఇన్‌చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి సీసీఈ విధానం అమలు కాబోతోందని, గుర్తింపులేని పాఠశాలల్లో చదివిన వారికి ఈ విధానం ద్వారా పదోతరగతి ప్రైవేటుగా పరీక్షలకు పంపించడం వీలుపడదని వివరించారు. ఈ నేపధ్యంలో చదివించిన పాఠశాల గుర్తింపు అంశం తెలుసుకోవడంపై తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు.
విద్యాశాఖ కొరడా
Published Sat, Jun 18 2016 8:37 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement