ఖతర్నాక్‌...కిక్‌ | District of football players good | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌...కిక్‌

Published Thu, Aug 18 2016 10:22 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఖతర్నాక్‌...కిక్‌ - Sakshi

ఖతర్నాక్‌...కిక్‌

ఫుట్‌బాల్‌ ఆటను నేర్చుకున్న వారు ఇతర అన్ని క్రీడల్లో సులువుగా రాణిస్తారని సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతుంటారు. ఎందుకంటే ఫుట్‌బాల్‌లో కఠోరమైన లెగ్‌వర్క్, శ్వాసను నియంత్రణ చేసుకునే శక్తి, సమయస్ఫూర్తి, సహనం ఉండాలి. ఇలా అన్నింటిని సమానస్థితిలో ఉంచుకుంటేనే క్రీడాకారులు పోటీల్లో రాణిస్తారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఫుట్‌బాల్‌లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు కూడా సత్తాచాటుతున్నారు. ఇంతింతై వటుడింతై.. అన్న చందంగా పతకాలు సాధిసూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.– న్యూశాయంపేట
  • ఫుట్‌బాల్‌లో రాటుదేలుతున్నజిల్లా క్రీడాకారులు
  • ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకు
 
ఫుట్‌బాల్‌ ఆటలో క్రీడాకారులు చిరుతలా పరుగెడుతుంటారు. భారీ విస్తరణ కలిగిన మైదానంలో ప్రత్యర్థి జట్టు నుంచి బాల్‌ను చేజిక్కించుకుని గోల్‌ చేసేందుకు క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. గోల్‌కీపర్‌ కన్ను తప్పించి బాల్‌ను వలయంలో వేసేందుకు వారు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలా చాకచక్యంగా వ్యవహరించే ఆటలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. 
ఫుట్‌బాల్‌ నేపథ్యం..
ఫుట్‌బాల్‌ ఆట మొదటగా 1863లో ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది. తొలుత ఈ ఆటను ‘రగ్‌బీ’గా పిలిచేవారు. భా రతదేశంలో బ్రిటీష్‌ సైనికులు 19వ శతాబ్దంలో ఫుట్‌బాల్‌ ఆటను ఆడారు. కాగా, భారతlఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ 1892లో స్థాపించబడింది. దీని మొదటి క్లబ్‌ కోల్‌కతాలో ఏర్పాటు చేశారు. ఇండియా జట్టు ట్రేడర్స్‌ కప్‌ను తొలిసారిగా 1892లో గెలుచుకుంది. మోహన్‌బగాన్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ కోల్‌కతాలో 1889తో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ క్లబ్‌ ప్రాచుర్యంలో ఉంది.
 
రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు
ఫుట్‌బాల్‌ ఆటలో మెుత్తం 11 మంది క్రీడాకారులు ఉంటారు. ఒక గోల్‌కీపర్‌ను మినహాయించి మిగతా పది మంది పాయింట్లు సాధించేందుకు మైదానంలో మెరుపు వేగంతో పరుగెడుతుంటారు. అయితే ఇలాంటి ఒత్తిడి కలిగిన ఆటలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ మేరకు ఆటలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఉదయం, సాయంత్రం వేళలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, కిట్స్‌ కళాశాల, నిట్, కేఎంసీ మైదానాల్లో కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. కాగా, ఎన్‌ఐఎస్‌ కోచ్‌ ఏటీబీటీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు  జాతీయస్థాయిలో రాణిస్తున్నారు.
 
నాగరాజు ప్రత్యేక ముద్ర
వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన వావిలాల నాగరాజు పుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్న ఆయన అందులో పేరు సంపాదించాలని కలలుగన్నాడు. ఈ మేరకు 6వ తరగతిలో ఫుట్‌బాల్‌ ఆటను ఎంపిక చేసుకుని కోచ్‌ల వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు. 2008లో ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాలలో చదువుతున్న సమయంలో పాల్వంచ, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్‌ డిస్ట్రిక్‌ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. అలాగే పాల్వంచ, గద్వాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 2013లో జరిగిన జాతీయస్థాయి టోర్నీలో పాల్గొని బెస్ట్‌ డిఫెన్స్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. 2013, 2014, 2015లో చెన్నై, ఢిల్లీ, కేరళలో జరిగిన మూడు ఇంటర్‌ యూనివర్సిటి టోర్నీల్లో పాల్గొన్నాడు. 2015లో వరంగల్‌ కేఎంసీ లో జరిగిన జిల్లా టోర్నమెంట్‌లో పాల్గొని బెస్ట్‌ స్కోరర్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నాగరాజు మా ట్లాడుతూ ప్రభుత్వం సహకారం అందిస్తే ఏదైనా క్లబ్‌ తరుపున జాతీయ, అంతర్‌జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకొస్తానని చెప్పారు.
 
పవర్‌ఫుల్‌.. రంజిత్‌కుమార్‌
స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సింగపురం రంజిత్‌కుమార్‌ ఫుట్‌బాల్‌ ఆటలో దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతున్నాడు. 6వ తరగతిలో ఫుట్‌బాల్‌ ఆటపై మక్కువ పెంచుకున్న ఆయన అందులో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ క్రమంలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2008లో పాల్వంచ, ఖమ్మం, కొత్తగూ డెం, వరంగల్‌లో జరిగిన డిస్ట్రిక్‌ టోర్నమెంట్‌లో, పాల్వంచ, గద్వాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 2013లో జరిగిన జాతీయస్థాయిటోర్నీలో పాల్గొని బెస్ట్‌ డిఫెన్స్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. 2013, 2014, 2015లో చెన్నై, ఢిల్లీ, కేరళలో జరిగిన మూడు ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. 2014 వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నీలో బెస్ట్‌ రన్నర్‌ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఏదైనా క్లబ్‌ తరుఫున జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొని ప్రతిభ చాటుతానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement