జిల్లా అతలాకుతలం | district struck with heavy rains | Sakshi
Sakshi News home page

జిల్లా అతలాకుతలం

Published Sat, Sep 24 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

ఝరాసంగం మండలం సింగితంలో ప్రయాణికులను దాటిస్తున్న స్థానికులు

ఝరాసంగం మండలం సింగితంలో ప్రయాణికులను దాటిస్తున్న స్థానికులు

మెదక్‌ బ్యూరో: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగుతున్నాయి. పాత ఇళ్లు కూలుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో జరిగిన నష్టం వివరాలు..

  • ఝరాసంగం మండలం గంగాపూర్‌ చెరువు, జీర్లపల్లిలోని ప్యాలవరం ప్రాజెక్టు, కుప్పానగర్‌ గుండం చెరువు, మేదపల్లి ఏనుగుల చెరువు, ఏడాకుపల్లి కొత్తూర్‌, బర్దీపూర్‌లోని పెద్ద కుంటలు, చెక్‌డ్యాంలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలో 26 ఇళ్లు పాక్షికంగా కూలాయి. చేతికొచ్చిన పత్తి, సోయాబీన్‌, మినుము, కంది పంటలు నీటమునిగాయి.  
  • దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి వెళ్లాల్సిన వాహనాలు హబ్షీపూర్, చేర్వాపూర్, దుబ్బాక, లచ్చపేట, చౌదర్‌పల్లి మీదుగా మళ్లించారు. పోతాన్‌పల్లి రామచెరువు, కసాన్‌పల్లి ఊర చెరువులకు బుంగలు పడ్డాయి. దుబ్బాక మండలంలో 500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
  • మిరుదొడ్డి మండలం లింగుపల్లి, అల్వాల కూడవెల్లి వంతెనలపై వరద నీరు ఊహించని రీతిలో ప్రవహిస్తోండటంతో రాకపోకలు స్థంభించిపోయాయి.  మిరుదొడ్డి కాసులాబాద్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
  • రేగోడ్‌: మండలంలో దాదాపు 25 ఇళ్లు కూలిపోయాయి. చౌదర్‌పల్లి, గజ్వాడ, రేగోడ్, సాయిపేట, జగిర్యాల చెరువులు, కుంటల్లోకి వర్షపునీరొచ్చి చేరుతుంది. గజ్వాడలోని కామెల్లి చెరువు చిన్నతూము మట్టి కొట్టుకుపోయింది.
  • మునిపల్లి మండలం పెద్దలోడిలో శిథిలావస్థకు చేరిన సుమారు 18 ఇళ్లు కూలాయి.
  • జగదేవ్‌పూర్‌ మండలంలో మొత్తం 92 ఇళ్లు కూలినట్టు అంచనా.
  • వెల్దుర్తి మండలంలో 220 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు హెక్టార్ల కంది, 20 హెక్టార్ల వరి, 10 హెక్టార్ల మక్కజొన్న పంటలు నీట మునిగాయి.
  • హత్నూర మండలంలో ఈ నాలుగు రోజుల్లో 332 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 218 చెరువు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. వరి 60 హెక్టార్లు, పత్తి 80 హెక్టార్లు, సోయాబిన్‌ 20హెక్టార్లలో నీట మునిగింది.
  • శివ్వంపేట మండలంలోని 206 కుంటలు, చిన్నచెరువులు, 16 పెద్ద చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. శివ్వంపేట పెద్దచెరువు, గూడూర్‌లోని బ్రహ్మసముద్రం చెరువులు 20 ఏళ్ల తర్వాత అలుగు పారాయి. దొంతిలోని పెద్ద చెరువు 30 ఏళ్ల తర్వాత అలుగు పారింది. మండలంలో 20 ఇళ్లు కూలాయి.
  • నారాయణఖేడ్‌ మండలంలో 55 ఎకరాల్లో వరి, 750 హెక్టార్లలో సోయా, కంది, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కల్హేర్‌లో వరి 250 ఎకరాలు, సోయా 550 ఎకరాలు, మనూరు మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
  • కంగ్టి మండలం దామర్‌గిద్దాలో దాదాపు 40 కుటుంబాలకు చెందిన 135 మందిని స్థానిక పాఠశాల, పంచాయతీ కార్యాలయం,  రామాలయంలో పునరావాసం కల్పించారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి దాదాపు 3 వేల ఎకరాల్లో సోయా, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 200పైగా ఇళ్లుకూలిపోయాయి.
  • రాయికోడ్‌ మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయికోడ్‌, సింగితం, నాగ్వార్‌, కుసునూర్‌, రాయిపల్లి, యూసుఫ్‌పూర్‌, హుల్గేర తదితర గ్రామాల శివార్లలోని వాగుల్లో వరద ఉధృతి కారణంగా ఆయా గ్రామాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు.
  • మెదక్‌ మండలంలో వంద ఇళ్లు  పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాల్వలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వంద ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి.
  • కౌడిపల్లి మండలంలో 94 ఇళ్లు కూలాయి. 50 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
  • జిన్నారం మండలం నర్రిగూడ, జంగంపేట వద్ద కల్వర్టులు పొంగి పొర్లుతుండంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంగంపేట, జిన్నారం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలో దాదాపు వంద ఎకరాల్లో వరి పంట మునిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement