నడ్డి విరుస్తున్న వడ్డీ! | District unauthorized citphands, Finance | Sakshi
Sakshi News home page

నడ్డి విరుస్తున్న వడ్డీ!

Published Tue, Jan 10 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

నడ్డి విరుస్తున్న వడ్డీ!

నడ్డి విరుస్తున్న వడ్డీ!

జిల్లాలో అనధికార   చిట్‌ఫండ్స్, ఫైనాన్సులు
మోసపోతున్న అమాయకులు
చిట్టీల నెల టర్నోవర్‌ రూ.120 కోట్లపైనే
రూ.30 కోట్లపైనే వడ్డీ వ్యాపారం
ప్రభుత్వ ఆదాయానికి గండి


జిల్లాలో చిట్టీల నిర్వహణ పేరిట మోసం జరుగుతోంది. రిజిస్టర్డ్‌ చిట్‌ఫండ్స్‌లో ఉన్న కఠిన నిబంధనలకు భయపడుతూ అనధికారిక ‘చిట్స్‌’పై ఆధారపడుతున్న ప్రజలు నట్టేట మునుగుతున్నారు. ముందు చూపుతో చిట్టీవేస్తే గడువు ముగిసేలోపే నిర్వాహకులు పరారవుతున్నారు. అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ వారు నిఘా పెట్టకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది.  జిల్లాలో 20కి మించి చిట్‌ఫండ్స్‌కు ప్రభుత్వ అనుమతి లేదు.. అయినా సుమారు వందకుపైనే చిట్‌ఫండ్స్‌ కొనసాగుతున్నాయి. ప్రతి నెల రూ. 120 కోట్లకు పైనే టర్నోవర్‌ ఉంది. ఇందులో  రూ.80 కోట్లకు పైగానే జీరో లావాదేవీలు సాగుతున్నట్లు అంచనా. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న చిట్టీలతో ప్రభుత్వానికి పన్నురూపంలో రావాల్సిన కోట్ల రుపాయలు రాకుండా పోతున్నాయి. చిట్టీల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఎక్కడా అమలు కావడంలేదు.

జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారు గడువు ముగిసేలోపే పరారవుతున్నారు. మూడు నెలల క్రితం.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిట్‌ఫండ్‌ నిర్వాహకుడు రూ. 2 కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించాడు. పదిరోజుల పాటు అతని ఇంటి చుట్టూ తిరిగిన బాధితులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు చిట్టీ నిర్వాహకుడిపై స్థానిక పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. ఇంత వరకు ఆ అక్రమార్కుడి ఆచూకీ లేదు. రెండు నెలల క్రితం.. మెట్‌పల్లిలోనూ ఓ ఉపాధ్యాయుడు రూ.2.50 కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించాడు.

అడ్డగోలు వడ్డీ..
అవసరానికి అప్పుచేస్తే.. వడ్డీ వ్యాపారులు రుణగ్రహితులను అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం వడ్డీ వ్యాపారం ఓ పరిశ్రమగా తయారైంది. ద్విచక్ర వాహనం, బంగారం, ఇళ్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి పట్టా, చెక్కు బుక్కులు, ఉద్యోగులైతే వారి బ్యాంకు ఏటీఎంలను తమ వద్ద కుదువ పెట్టుకొని 5 నుంచి  20 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పుల పాలై.. వడ్డీ వ్యాపారుల చేతిలో నరకయాతన అనుభవిస్తున్న వాళ్ల సంఖ్యా జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే ఉంది. ముఖ్యంగా రైతులు వడ్డీ వ్యాపారుల దోపిడీకి బలవుతున్నారు. పంట కోసం బ్యాంకు రుణం తీసుకోవాలంటే.. అప్పటి వరకు తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించిన వారంలోపే బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేస్తాయి. వాటిని రెన్యూవల్‌ చేసుకోవాలంటే.. పాత బకాయిలు చెల్లించక తప్పదు. దీంతో వారంలోగా రుణం మంజూరవుతుందనే ఆశతో రైతులు స్థానికంగా తమకు తెలిసిన వడ్డీ వ్యాపారుల నుంచి ఫైనాన్స్‌ తీసుకుంటారు. వడ్డీ వ్యాపారులు రైతుల పాస్‌ పుస్తకాలు తమ వద్ద పెట్టుకుని 10 శాతం వడ్డీతో రుణాలు ఇస్తారు. ఇలా జిల్లాలో రూ. 30 కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. మరోవైపు రుణం మంజూరు కాక.. వడ్డీలు చెల్లించలేక సతమతమవుతోన్న రైతులు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు.

నిబంధనలు తుంగలో తొక్కి..
ఫైనాన్స్‌ నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. తాము నిర్వహిస్తున్న ఫైనాన్స్‌ పేరిట జిల్లా రిజిష్ట్రార్‌ కార్యాలయంలో రిజిష్ట్రేషన్‌ చేయించుకోవాలి. అదే పేరున పాన్, టాన్‌ కార్డు తీసుకోవాలి. రిజిష్ట్రేషన్, పాన్, ట్యాన్‌లతో బ్యాంకులో సంస్థ పేరున ఖాతా ప్రారంభించాలి. వీటితో పాటు మండల తహసీల్దార్‌తో ఏటా మనీ లెండింగ్‌ లైసెన్స్‌ సర్టిఫికెటు తీసుకోవాలి. ఏటా మున్సిపాలిటీకి కార్మిక శాఖ కార్యాలయంలో కూడా పన్ను ప్రతి చెల్లించాలి. ఏడాదికోసారి చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) ద్వారా ఆడిటింగ్‌ చేయించి ఆదాయపు పన్ను శాఖకు తాము చేసిన వ్యాపారంపై పన్ను చెల్లించాలి. తప్పనిసరిగా పాన్‌ కార్డుతో పాటు ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. ఈ నిబంధనలు పాటిస్తోన్న ఫైనాన్స్‌ నిర్వాహకులు జిల్లాలో బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు.  పెద్ద పెద్ద కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని అందర్ని ఆకర్శితుల్ని చేస్తూ అక్రమంగా కోట్లాది రూపాయల టర్నోవర్‌ చేస్తున్న వడ్డీ వ్యాపారులు ఎంతో మంది ఉన్నారు. మరోపక్క.. గుట్టుచప్పుడు కాకుండా ఎలాంటి కార్యాలయం లేకుండానే అవసరమున్న వారికి అప్పులు ఇస్తూ వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులు ఎంతో మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement