రైతులతో మమేకం కాకుంటే మీరెందుకు!
రైతులతో మమేకం కాకుంటే మీరెందుకు!
Published Tue, Jun 13 2017 11:36 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రైతులకు అందుబాటులో ఉండేందుకే ఎంపీఈఓల వ్యవస్థను తీసుకువచ్చారని.. రైతులతో మమేకం కానప్పుడు వారి సేవలు ఎవరికి అవసరమని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు, ఎంపీఈఓలతో నారుమడులు ప్రక్రియ, జేఎల్‌జీ, జేఎంజీ గ్రూపుల ఏర్పాటు తదితర అంశాలపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఎంపీఈఓల కోసం రైతులు లేరని.. రైతులున్నారు కాబట్టే ఎంపీఈఓల వ్యవçస్థ తీసుకువచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. వారంతా గ్రామాల్లో రైతులకు కచ్చితంగా అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేయాలన్నారు.
నూరు శాతం నారుమడులు పూర్తి కావాలి
జిల్లాలో దశాబ్ద కాలంగా వ్యవసాయ క్యాలెండర్ దారి తప్పిందని.. అందువల్ల ఖరీఫ్ ఆలస్యమవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో జూ¯ŒSలో నారుమడులు పూర్తి చేసుకుని అక్టోబర్ చివరి నాటికి కోతలు పూర్తయ్యేవన్నారు. తిరిగి నవంబర్‌లో రబీ పనులు ప్రారంభమయ్యేవని అన్నారు. రెండేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేశామని.. భవిష్యత్‌లోనూ ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పారు. గోదావరి డెల్టాలో నారుమడులు రేపటికల్లా పూర్తి కావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 90 శాతం కన్నా తక్కువ నారుమడులు పడిన చోట్ల సంబంధిత అధికారుల నుంచి సంజాయిషీ కోరాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరిని ఆదేశించారు.
డెల్టాకు చేటు తేవద్దు : చేపల చెరువుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించవద్దన్నారు. వ్యవసాయ భూమిని సాగుకు పనికిరాదని నివేదికలు ఇస్తే డెల్టాకు ముప్పు చేసినవారవుతారన్నారు. ఈ విషయంలో సమగ్ర పరిశీలన చేయాలని, చిన్న అనుమానం తలెత్తినా కచ్చితంగా తిరస్కరించాలని ఆయన సూచించారు.
కౌలు రైతులకు వెయ్యి కోట్లు
జిల్లాలోని రైతుల్లో 75 నుంచి 80 శాతం కౌలు రైతులేనన్న విషయాన్ని వ్యవసాయ అధికారులు మరిచిపోవద్దన్నారు. జిల్లాలో 3.5 లక్షల మందికి రుణార్హత కార్డులు అందించామన్నారు. అయినప్పటికీ సరైన రీతిలో కౌలు రైతులకు రుణాలు అందడం లేదన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మాదిరిగా జేఎల్‌జీ, జేఎంజీ గ్రూపులను కౌలు రైతులతో ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఎంపీఈఓ వారి పరిధిలోని కాలువల నీటి మట్టాలను లాగ్‌బుక్‌లో నమోదు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల సరఫరా, భూసార పరీక్ష కార్డులు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, డెప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏఈఓలు, ఎంపీఈఓలు పాల్గొన్నారు.
Advertisement