బలవంతపు భూసేకరణ వద్దు: బీజేపీ
ఆల్కాట్‌తోట(రాజమండ్రి): రాజధాని కోసం బలవంతపు భూసేకరణ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌లో 30 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చార ని, జరీబు, గ్రామకంఠం భూమి విషయంలో అభ్యంతరాలను పరిశీలించాలన్నారు. శుక్రవారం స్థానిక లా హాస్పిన్ హోటల్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హరిబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రణాళికలను రూపొందిస్తోందని, ఏ రాష్ట్రానికీ చేయని సహాయం చేస్తోందని చెప్పారు.
పునర్విభజన చట్టంలో ఉన్నవి, లేనివి కూడా కేంద్రం రాష్ట్రానికి చేస్తుందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఆందోళన చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ రాదని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసరవస్తువుల ధరలపై తమ పార్టీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో చర్చిస్తుందన్నారు. సుమారు 971 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఓడరేవులు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నామని, తీరప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికాబోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వంతో తీర్మానం చేయించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వవ్యవస్థీకరించాలని కోరతామన్నారు.
పట్టిసీమ వేగమే పోలవరంలోనూ చూపాలి
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసినంత వేగంగానే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని హరిబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయూన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని అభ్యర్థిస్తామని చెప్పారు. పోలవరం పనులు జరుగుతున్న తీరు, ఆలస్యానికి కారణాలను పరిశీలించడానికి తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సెప్టెంబరు 12న క్షేత్రస్థారుులో పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. సెప్టెంబరు 13న విజయనగరం జిల్లాలోని రిజర్వాయర్ పూర్తయినా పంటకాలువలు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఉపయోగంలోకి రాని తోటపల్లి ప్రాజెక్టును సందర్శిస్తుందన్నారు.
14, 15 తేదీల్లో రాయలసీమలోని నగరి, హంద్రీనీవా, కాలేరు ప్రాజెక్టులు, కరువు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. మిగిలిన వెలిగొండ, వంశధార-2, పులిచింతల ప్రాజెక్టుల్ని తరువాత పరిశీలించి వాటి పూర్తికీ కృషి చేస్తుందన్నారు. కేంద్రం పదివేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోనుందని చెప్పారు. స్మార్ట్‌సిటీలను మార్గదర్శక సూత్రాల ప్రకారమే ప్రకటించినట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, పార్టీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ సంఘటనా కార్యదర్శి బి.రవీంద్రరాజు పాల్గొన్నారు.