kambampati haribabu
-
హోదా సంజీవని కాదన్నారుగా!
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకోసం మాట మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని అడగడం ఏమిటని ప్రశ్నించారు. 2019లోనూ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలంటూ ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం బహిరంగ లేఖ రాస్తు న్నానంటూ టీడీపీకి, సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆదివారం విజయవాడలో బహిరంగలేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. ఆ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అందజేసే అదనపు సాయాన్ని లెక్కగట్టి మన రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ విమర్శలకు భయపడి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జంకుతోందని ఎద్దేవా చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది కేంద్రం నుంచి 82 శాతం అధికంగా నిధులొచ్చాయని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారని తెలిపారు. విదేశాల్లో ప్రధానిపై విమర్శలా? ‘‘చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తూ ప్రధా ని మోదీపై విమర్శలు చేయడాన్ని మేము(బీజేపీ) తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధాని దీక్ష చేయడాన్ని సీఎం తప్పుపట్టారు. మరి ఈనెల 20న సీఎం హోదాలో దీక్ష చేయాలన్న నిర్ణయానికి ఆయన ప్రజలకు ఏం జవాబు చెబుతారు’’అని హరిబాబు ప్రశ్నించారు. హామీలు 85 శాతం అమలు ‘‘వివిధ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం నిధులిచ్చినా వాటికి అవసరమైన భూములు రాష్ట్రప్రభుత్వం ఇవ్వకపోతే భవనాలను ఆకాశంలో కడతారా? కేంద్రం మూడున్నరేళ్లలో హామీలను 85 శాతం అమలు చేసింది. ’’అని చెప్పారు. -
టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి : బీజేపీ
విజయవాడ : టీడీపీ నేతలకు దమ్ముంటే నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఏమిచ్చారనే దానిపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వాస్తవాలు వెల్లడించారన్నారు. అయినా టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకే కేంద్రం రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందంటూనే, టీడీపీ నేతలు వారితో కలిసి బంద్‌లో ఎలా పాల్గొంటారని శ్యామ్ కిషోర్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో క్లారిటీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కి అన్నిఇస్తున్నామని చెప్పారు. మిత్రధర్మాన్ని టీడీపీ నాయకులు పాటించకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి ఉన్న రాజకీయ అవసరాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ ఎంపీల హెచ్చరికలను పట్టించుకోమని స్పష్టం చేశారు. బడ్జెట్ లో కేటాయిస్తేనే నిధులు వస్తాయనుకోవడం టీడీపీ నాయకుల అవివేకం అని మండిపడ్డారు. ముష్టి, బిక్షం వంటి పదాలను టీడీపీ నాయకులు కట్టిపెట్టాలని సూచించారు. రాజధానికి సంబంధించిన డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రాష్ట్రం నుంచి ఇంకా కేంద్రానికి అందలేదని శ్రీనివాస్ రాజు అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన రూ.లక్ష కోట్ల లెక్కలు టీడీపీ నాయకులు చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామని, తమ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హరిబాబు చెప్పిన లెక్కలపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. -
బలవంతపు భూసేకరణ వద్దు: బీజేపీ
ఆల్కాట్‌తోట(రాజమండ్రి): రాజధాని కోసం బలవంతపు భూసేకరణ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌లో 30 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చార ని, జరీబు, గ్రామకంఠం భూమి విషయంలో అభ్యంతరాలను పరిశీలించాలన్నారు. శుక్రవారం స్థానిక లా హాస్పిన్ హోటల్లో ఆయన అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హరిబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రణాళికలను రూపొందిస్తోందని, ఏ రాష్ట్రానికీ చేయని సహాయం చేస్తోందని చెప్పారు. పునర్విభజన చట్టంలో ఉన్నవి, లేనివి కూడా కేంద్రం రాష్ట్రానికి చేస్తుందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఆందోళన చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ రాదని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసరవస్తువుల ధరలపై తమ పార్టీ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో చర్చిస్తుందన్నారు. సుమారు 971 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఓడరేవులు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నామని, తీరప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికాబోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వంతో తీర్మానం చేయించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వవ్యవస్థీకరించాలని కోరతామన్నారు. పట్టిసీమ వేగమే పోలవరంలోనూ చూపాలి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసినంత వేగంగానే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని హరిబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయూన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని అభ్యర్థిస్తామని చెప్పారు. పోలవరం పనులు జరుగుతున్న తీరు, ఆలస్యానికి కారణాలను పరిశీలించడానికి తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సెప్టెంబరు 12న క్షేత్రస్థారుులో పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. సెప్టెంబరు 13న విజయనగరం జిల్లాలోని రిజర్వాయర్ పూర్తయినా పంటకాలువలు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఉపయోగంలోకి రాని తోటపల్లి ప్రాజెక్టును సందర్శిస్తుందన్నారు. 14, 15 తేదీల్లో రాయలసీమలోని నగరి, హంద్రీనీవా, కాలేరు ప్రాజెక్టులు, కరువు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. మిగిలిన వెలిగొండ, వంశధార-2, పులిచింతల ప్రాజెక్టుల్ని తరువాత పరిశీలించి వాటి పూర్తికీ కృషి చేస్తుందన్నారు. కేంద్రం పదివేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోనుందని చెప్పారు. స్మార్ట్‌సిటీలను మార్గదర్శక సూత్రాల ప్రకారమే ప్రకటించినట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, పార్టీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ సంఘటనా కార్యదర్శి బి.రవీంద్రరాజు పాల్గొన్నారు.