శ్రమించండి.. సాధించండి | do work hard | Sakshi
Sakshi News home page

శ్రమించండి.. సాధించండి

Published Sat, Jan 21 2017 10:53 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

శ్రమించండి.. సాధించండి - Sakshi

శ్రమించండి.. సాధించండి

 ’గ్రూప్స్‌’ అభ్యర్థులకు నిపుణుల సూచన
గ్రూప్‌2, 3 పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ’సాక్షి’ మీడియా గ్రూప్, రాజూస్‌ ఐఏఎస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పరీక్షలకు ఎలా సిద్ధపడాలి, ఏయే సబ్జెక్టులపై దృష్టి సారించాలనే విషయమై ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రొఫెసర్లు. సబ్జెక్ట్‌ నిపుణులు అవగాహన కల్పించారు. పుస్తకాల ఎంపికపై సగం విజయం ఆధారపడి ఉంటుందని, బట్టీ విధానం పనికిరాదని, విశ్లేషణాత్మక దృష్టితో చదవాలని, ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని సూచించారు.
కఠోర శ్రమ, కసితో చదివితే గ్రూప్‌​-1, 2, 3 ఉద్యోగాలు సాధించడం ఏమంత కష్టం కాదని, సమయపాలన, ప్రత్యేక ప్రణాళిక, నిరంతర సాధన, శిక్షణ తోడైతే విజయం ఖాయం అని వక్తలు ఉద్బోధించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రిక ‘రాజూస్‌’ ఐఏఎస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ఆర్‌ఆర్‌పేటలో రాజూస్‌ అకాడమీలో గ్రూప్స్‌ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సబ్జెక్ట్‌ నిపుణులు, ప్రొఫెసర్లు, అధికారులు తమ ప్రసంగాల ద్వారా ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. 
-ఏలూరు సిటీ /ఆర్‌ఆర్‌పేట/మెట్రో 
 
సదస్సుకు రాజూస్‌ అకాడమీ డైరెక్టర్‌ రత్నరాజు అధ్యక్షత వహించగా ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్‌ఏ ఖాదర్, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, సర్‌ సీఆర్‌ఆర్‌ పీజీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.వెంకటేశ్వరరావు, పీజీ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ తేరా రాజేష్, ఇంగ్లిష్‌ విబాగాధిపతి ఎంఎస్‌సీ సోఫియా, ఏలూరు టూటౌన్‌ సీఐ ఉడతా బంగార్రాజు హాజరయ్యారు. గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రిపరేషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా ప్రిలిమినరీ మోడల్‌ పేపర్‌ను అందజేశారు. అభ్యర్థులు ఏ విధంగా పరీక్షలకు సిద్ధమవ్వాలి, ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. అంతేకాదు తాము ఉద్యోగాలు సాధించే నాటికి, నేడు ఉన్న సామాజిక పరిస్థితులను బేరీజు వేస్తూ వివరణాత్మక సందేశాలను అందించారు. సదస్సుకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
‘సాక్షి’ అభినందనీయం 
‘సాక్షి’ దినపత్రిక సామాజిక బాధ్యతలో భాగంగా ఉద్యోగార్థులకు ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించటం అభినందనీయమని ఆర్‌ఐవో ఖాదర్‌ అన్నారు. ఈ సదస్సు ద్వారా అభ్యర్థుల్లో భయాన్ని పోగొట్టి స్ఫూర్తిని నింపిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు తాజా వార్తాల సమాచారం అందించటమే కాకుండా యువతకు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా ‘భవిత’ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు, మెటీరియల్స్, నిపుణుల విశ్లేషణలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. యువత కేవలం గ్రూప్స్‌ ఉద్యోగాలకే పరిమితం కాకూడదన్నారు. రోజూ అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతుంటాయని, వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రిపేరవ్వాలని సూచించారు. సదస్సుకు హాజరైన గ్రూప్‌​‍్స అభ్యర్థులు మాట్లాడుతూ ‘సాక్షి’ నిర్వహించిన ఈ అవగాహన సదస్సు తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కృతజ్ఞతలు తెలిపారు. 
 
 
 
ఇతరులకన్నా మీరేమీ తక్కువ కాదు 
చాలామందిలో తాము సాధించగలమా అనే సందేహం ఉంటుంది. అటువంటి వారందరూ ఇతరులకన్నా తామేమీ తక్కువ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. సివిల్స్, గ్రూపులు సాధించిన వారు కాస్త ఎక్కువ కష్టపడతారు. అలాంటి కష్టం మీరు కూడా పడితే మీ లక్ష్యాలు సాధించడం చాలా సులభం. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో ఇతరులకంటే ఉన్నతంగా జీవించాలనే లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే తమ లక్ష్యాలు సాధించగలుగుతారు. స్వామి వివేకానంద చెప్పినట్టు అందరూ ఉక్కు నరాలు, ఇనుపకండరాలు కలిగి ఉండాలి.
ఫొటో నంబర్‌ 504 -పి.రత్నరాజు, రాజూస్‌ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ 
 
పుస్తకాల ఎంపికతోనే సగం విజయం 
ఉద్యోగార్థులు తాము ఏ ఉద్యోగానికి సన్నద్ధమౌతున్నారో, దానికి ఏ పుస్తకాలు అవసరమౌతాయో సరిగ్గా ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే. ఉద్యోగం రాకపోతే జీవితం లేదు, సమాజంలో తలెత్తుకు తిరగలేం అనే కసితో చదవాలి. కోరికలను సాఫల్యం చేసుకునే చిత్తశుద్ధి ఉండాలి. మీలో ఉన్న శక్తిని మీరే గుర్తించాలి. సమాజంతో సంబంధంలేకుండా ఎక్కువ సమయం చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఉద్యోగం మీ పాదాక్రాంతమౌతుంది. 
ఫొటో నంబర్‌ 505 : -ఎస్‌ఏ ఖాదర్, ఆర్‌ఐవో 
 
బట్టీ విధానం పనికిరాదు  
ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ప్రధాన సవాలుగా నిలుస్తోంది. చదువులో ఎంత గొప్ప ప్రతిభ కనబరిచినా భావ వ్యక్తీకరణలో వెనుకబడడం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. వాటిని మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మీ తెలివితేటలు భవిష్యత్‌ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మీరు అభివృద్ధి సాధించాలి. బట్టీ పట్టే విధానం నేటి రోజుల్లో అస్సలు పనికి రావడం లేదు. రాత్రి 10 గంటల తరువాత నుంచి  చదివితే అప్పటి ప్రశాంత వాతావరణానికి చదివింది మెదడులో నాటుకుపోతుంది.
ఫొటో నంబర్‌ 506 : -వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో 
 
కోచింగ్‌ తప్పనిసరి 
ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలని సరిపెట్టుకోవద్దు. పెద్దపెద్ద ఉద్యోగాలు సాధించాలనే ఉన్నత లక్ష్యాల వైపు పయనించండి. మీకు ఉద్యోగం తప్పనిసరి ఐతే ఖచ్చితంగా కోచింగ్‌ తీసుకోవాలి. మనకు తెలియని సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే కోచింగ్‌ ఉండాలి. సాఫ్ట్‌వేర్‌లో జీతాలు ఎక్కువని చాలామంది వాటిపై ఆకర్షితులౌతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా జీతాలు అధికం. పైగా ఉద్యోగ భద్రత ఎక్కువ. ఒక్కసారి కోచింగ్‌ తీసుకుని వదిలేయవద్దు ఉద్యోగం సాధించే వరకూ కోచింగ్‌ తీసుకుంటూనే ఉండండి.
ఫొటో నం : 507 : -ఉడతా బంగార్రాజు, టూటౌన్‌ సీఐ 
 
విశ్లేషణాత్మకత అవసరం 
ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు తాము ఏ పుస్తకం చదివినా ఏ సబ్జెక్ట్‌ చదివినా అందులో విశ్లేషణాత్మకతను జోడించండి. అటువంటప్పుడే ఒక ప్రశ్నను ఏ కోణంలో అడిగినా జవాబు ఇవ్వడం సులభతరమౌతుంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటిని చేరుకోవడానికి దగ్గర మార్గాలు లేవని తెలుసుకోవాలి. ఆలోచించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకండి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ప్రపంచం కుగ్రామమైంది. మీ అరచేతిలోనే సమాచారమంతా అందుబాటులో ఉంటోంది, దానిని సద్వినియోగం చేసుకోండి.
ఫొటో నం : 508 : -ఎల్‌.వెంకటేశ్వరరావు, సీఆర్‌ఆర్‌ పీజీ కాలేజీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 
 
ప్రాధాన్యతాంశాలను గుర్తించండి 
పరీక్షల్లో వచ్చే ప్రాధాన్యతాంశాలను గుర్తించడం అభ్యర్థులకు ముఖ్యం. సిగ్గు, బిడియం, భయాలను ఈ సమయంలోనే విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న ఇతర అభ్యర్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోండి. వారి ద్వారా మరింత జ్ఞాన సముపార్జన సాధ్యమౌతుంది. సబ్జెక్టుపై చర్చిస్తే దానిపై మనకు తెలియని సందేహాలకు సమాధానలు దొరికే అవకాశముంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం సాధించవచ్చు.
ఫొటో నం 509 : -డాక్టర్‌ తేరా రాజేష్, సీఆర్‌ఆర్‌ పీజీ కాలేజ్‌ ఫ్రొఫెసర్‌ 
 
సందేహాలను నివృత్తి చేసుకోండి 
కోచింగ్‌ సెంటర్లలో అధ్యాపకులు చెప్పే విషయాలు నిశితంగా గ్రహించండి. ఎటువంటి సందేహాన్నైనా అడిగి తెలుసుకోండి. పక్కవాళ్లు నవ్వుతారనే భావన ముందుగా మీలోంచి తొలగించుకోండి. 99 శాతం కష్టపడేవాళ్లే ఏదైనా సాధించగలుగుతారు. మీలో కూడా నైపుణ్యం ఉంది. దానిని మీరే మరింత మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీ తరువాత తరాలకు మీరు రోల్‌ మోడల్‌గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.
ఫొటో నం 510 : -ఎంఎస్‌సీ సోఫియా, సీఆర్‌ఆర్‌ పీజీ కాలేజ్, ఇంగ్లిష్‌ విభాగాధిపతి 
 
ప్రశ్న- జవాబు 
 
ప్రశ్న : ఇంజనీరింగ్‌ విద్యార్థి గ్రూప్స్‌కు ఎలా సిద్ధపడాలి? 
వి.నిఖిత, గ్రూప్స్‌ అభ్యర్థి, ఏలూరు 
నిపుణుల జవాబు : బీటెక్‌ చదివిన విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని అంచనా వేసుకుని నిపుణుల సలహాలతో సిద్ధపడితే విజయం తథ్యం.
 
ప్రశ్న : నెగిటివ్‌ మార్కుల విధానాన్ని ఎలా అధిగమించాలి 
టిఎస్‌ఎస్‌కె పవన్, గ్రూప్స్‌ విద్యార్థి
నిపుణుల జవాబు : నూతన గ్రూప్స్‌ విధానంలో మైనస్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థి సరైన జవాబును గుర్తించి మాత్రమే ఆన్సర్‌ చేయాలి. అంచనాతో జవాబును గుర్తించే విధానాన్ని మానుకోవాలి. గ్రూప్‌-2 పరీక్షల్లో ఈ నెగిటివ్‌ విధానం లేదు. గ్రూప్‌-1లో మాత్రమే నూతనంగా ప్రవేశపెట్టారు.
 
 
ప్రశ్న : పోలీస్‌ పరీక్షలకు, గ్రూప్స్‌కు తేడా ఏమిటి?
 అనిత, గృహిణి, గ్రూప్స్‌ అభ్యర్థిని
నిపుణుల జవాబు : పోలీస్‌ పరీక్షలకు చేస్తున్న ఫిజికల్‌ ఈవెంట్స్‌కు కాస్త పోటీ పరీక్షల సిలబస్‌ను జోడిస్తే తప్పక విజయం సాధించవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని, ఫిజికల్‌ పరీక్షలకు శిక్షణ తీసుకోకుంటే పోలీస్‌ ఉద్యోగం సాధించడం కష్టం. రెండు అంశాలపైనా దృష్టిసారిస్తే విజయం సాధించవచ్చు. 
 
ప్రశ్న : తక్కువ సమయంలో విజయం సాధించడం ఎలా?
ఎన్‌.సుస్మిత, గ్రూప్స్‌ అభ్యర్థిని
నిపుణుల జవాబు : సమయం తక్కువ ఉన్నందున గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రస్తుతం పూర్తిగా ప్రిలిమినరీపైనే దృష్టి కేంద్రీకరించాలి. మెయిన్స్‌ సిలబస్‌పై ప్రిలిమ్స్‌ అయిన మరుక్షణం దృష్టి సారించాలి. 
 
ప్రశ్న :  ఎగ్జామ్‌లో సమయాన్ని ఎలా కేటాయించాలి?
 వెంకటేశ్వరరావు, గ్రూప్స్‌ విద్యార్థి, చోడవరం, నల్లజర్ల
నిపుణుల జవాబు : గ్రూప్స్‌ ప్రిలిమ్‌​‍్స ఎగ్జామ్‌ పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో బిట్‌కు 30 సెకన్ల నుంచి ఒక నిమిషం కేటాయిస్తే సమయం సరిపోతుంది. లేకుంటే చివరిలో తీవ్ర గందరగోళంగా  ఉండి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం గుర్తించలేం. పోటీ పరీక్షల్లో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement