జిల్లాలో పాలనా యంత్రాంగ ఉందా? | Does administration in the district? | Sakshi
Sakshi News home page

జిల్లాలో పాలనా యంత్రాంగ ఉందా?

Published Thu, Dec 29 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

జిల్లాలో పాలనా యంత్రాంగ  ఉందా?

జిల్లాలో పాలనా యంత్రాంగ ఉందా?

- మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా కార్మికులను పట్టించుకునే దిక్కులేదు
- శాసనమండలి హామీల కమిటీ అసంతృప్తి
కర్నూలు(అగ్రికల్చర్‌): ‘జిల్లాలో యంత్రాంగం ఉందా..? కార్మిక శాఖ పనిచేస్తుందా? శాసన మండలిలో మంత్రి 2014లోనే కర్నూలు పేపర్‌మిల్‌ లాకౌట్‌ను ఎత్తివేస్తున్నామని, కార్మికులకు జీతాలు ఇస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ చూస్తే పేపర్‌మిల్లు తెరిచే పరిస్థితి లేదు. కార్మికులను పట్టించుకునే దిక్కు లేదు’ అని శాసనమండలి హామీల అమలు కమిటీ (అస్సూరెన్స్‌) సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యాయా అనేదానిపై హామీల అమలు కమిటీ గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్షించింది. శాసన మండలి చైర్మన్‌ చక్రపాణి యాదవ్, హామీల అమలు కమిటీ చైర్మన్‌ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సభ్యులు చంద్రశేఖర్‌రావు, సుధాకర్‌బాబు తదితరులు సమీక్షించారు. 27 హామీలు ఉండగా కొన్నింటిని మాత్రమే సమీక్షించారు. 
 
పేపర్‌మిల్లుపై మంత్రి ఇచ్చిన హామీ గాలికొదిలారా?
రాయలసీమ పేపర్‌మిల్లు హామీని సమీక్షించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన వివరాలు ఏమాత్రం సరిపోకపోవడంతో కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి శాసనమండలిలో 2014లోనే లాకౌట్‌ ఎత్తివేస్తున్నామని, కార్మికులందరికీ వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. జిల్లాలో కార్మిక శాఖ ఏమి చేస్తోంటూ ప్రశ్నించారు. కేవలం 120 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్లు లెక్కలున్నాయని మిగతా కార్మికుల పరిస్థితి ఏమైందని కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రావు, సుధాకర్‌ రావు ప్రశ్నించారు. 
  •  బీడీ కార్మికులందరికీ చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయాలని కమిటీ చైర్మన్‌ గాలిముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఎంతమంది బీడీ కార్మికులను గుర్తించారు, వెయ్యి బీడీలు చుడితే ఇస్తున్న మొత్తమెంత? తదితర వివరాలను ఆరా తీశారు. 
  •  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ సర్జరీ యూనిట్‌ ఏర్పాటుపై సంబంధిత మంత్రి శాసనమండలిలో హామీ ఇచ్చారని, దీని అమలు ఎంతవరకు వచ్చిందని కమిటీ చైర్మన్‌ ప్రశ్నించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరస్వామి మాట్లాడుతూ రూ.7.50 కోట్లతో కొన్ని నెలల క్రితమే కార్డియాలజీ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించామని, మూడు నెలల్లో 36 ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేసినట్లు వివరించారు. హామీ అమలు పట్ల అస్సూరెన్స్‌ కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. 
  •  తుంగభద్రపై రిజర్వాయర్ల నిర్మాణంపై నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఇచ్చిన వివరాల పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 6జిల్లాలకు కర్నూలు నుంచే నీళ్లు రావాల్సి ఉందని, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరునగరి కాల్వలన్నీ కర్నూలు నుంచే మొదలై వివిధ జిల్లాలకు నీటిని ఇస్తున్నాయని తెలిపారు. 
  • జిల్లాలో గంజాయి సాగు గురించి శాసనమండలిలో వచ్చిన ప్రశ్నకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ఆరా తీయగా ఇప్పటివరకు జిల్లాలో 19 గంజాయి కేసులు పెట్టామని, 607 మొక్కలు, 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
  •  కర్నూలు బంగారుపేట నీలిషికారీలకు పునరావాసం కల్పించే దిశగా చర్యలు  గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు.
  •  2014 ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కాకపోగా 2015 కరువుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కావడం ఏంటని కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రావు ప్రశ్నించడంతో ఒకటిరెండు రోజుల్లో 2014 కరువుకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కానుందని కలెక్టర్‌ వివరించారు.

    రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులు, వాటిని అధిగమించిన తీరు తదితరవాటిని జిల్లా కలెక్టర్‌ సభ్యులకు వివరించారు. పశుగ్రాసం, తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇంటి స్థలాల ఇవ్వడం తదితర సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మల్లించడం ద్వారా రాయల సీమలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఇబ్బందులు కలుగ లేదని అన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు 60 టిఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చిందని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ప్రమీల, కార్మిక శాఖ, ఎక్సైజ్, నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement