ఇదేమి పెత్తనం
- ఎంపీ నిధులతో చేపట్టే పనులకు కోడలు ప్రారంభోత్సవాలు
- అధికారిక కార్యక్రమాల్లో ఆమెదే హవా
- విస్తుబోతున్న అనుచరగణం
- ప్రేక్షకపాత్రలో అధికారులు.
మురళీమోహన్ వయస్సు రీత్యా చేదోడువాదోడుగా ఉండేందుకు వస్తున్నారని ఇంతకాలం పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటూ వస్తున్నాయి. మురళీమోహన్ ఏమనుకుంటారేమోననే మొహమాటంతో ఆయనతోపాటు కార్యక్రమాల్లో వేదికపైకి కోడల్ని కూడా అనివార్యంగా ఆహ్వానిస్తున్నారు. అది పార్టీ కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా సరే. మామ వెంట కోడలు రావడంలో తప్పేంటని సమర్థిస్తూ వచ్చిన వారు కూడా రంగాపురం గ్రామంలో సోమవారం (12వ తేదీన) ఆమె చేసిన ప్రారంభోత్సవాలతో ఒక్కసారిగా విస్తుపోయారు..
అలా దత్తత తీసుకుని రెండున్నరేళ్లవుతున్నా ఎంపీ పర్యటించిది వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో కోడలు ఆకస్మికంగా ఈ నెల 12వ తేదీన (సోమవారం) రూ.12 లక్షల వ్యయంతో ఎంపీ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాలును ప్రారంభించి, రూ.7 లక్షలు ఎన్‌ఆర్‌జీఎస్, పంచాయతీ నిధుల భాగస్వామ్యంతో బీసీ కాలనీ రోడ్డు పనులకు రూపాదేవి కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశ వేదికపైకి రూపాదేవిని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా పరిచయం చేసి మాట్లాడాల్సిందిగా కోరడం విశేషం.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి రూ.19 లక్షలతో పంచాయతీ భవనం, రూ.9.50 లక్షలతో అంగన్‌వాడీ భవనం, రూ.4 లక్షలతో ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అదే సమయంలో రూపాదేవి రంగాపురంలో ప్రారంభోత్సవాలు ఏ హోదాతో చేశారని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గ్రామాన్ని దత్తత తీసుకున్నంత మాత్రాన కోడలు ప్రారంభోత్సవాలు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ నిధులు తమ సొంత జేబులోంచి తీసి ఖర్చు చేస్తున్నట్టుగా భావిస్తున్నట్టున్నారని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మేధావి వర్గం ఆక్షేపిస్తోంది.