
చరిత్ర ఉన్నంత కాలం బాబును నమ్మరు
- గుంటూరు మార్కెట్ యార్డు మాజీ కార్యదర్శి నరహరి అనుచిత వ్యాఖ్యలు
- సీఎం చంద్రబాబుపైనా తనదైన శైలిలో విమర్శలు
- విలేకర్లను బిచ్చగాళ్లతో పోలుస్తూ సంభాషణలు
- నరహరి ఆడియో టేపులతో మార్కెటింగ్ శాఖలో కలకలం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను మోసం చేశాడు. ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. తెలుగు చరిత్ర ఉన్నంత కాలం, మానవాళి మనుగడ సాగించినంత కాలం బాబు చేసిన ద్రోహం ప్రజలు మరిచిపోరు.. అలాంటి బంగారం లాంటి వ్యక్తిని అన్యాయంగా చంపేశాడు’. ఇది ఎవరో రాజకీయ నేత చేసిన విమర్శ కాదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నత శ్రేణి కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి అన్న మాటలు. గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం విజయవాడ మార్కెట్ యార్డు కార్యదర్శిగా ఉన్న ఎన్.నరహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించాయి. గుంటూరు యార్డులో కమీషన్ ఏజెంట్ల లైసెన్స్‌లకు సంబంధించి 293 మంది వ్యాపారుల వద్ద రూ.కోటికి పైగా మొత్తం నరహరి వసూలు చేశాడు. ఈ క్రమంలో వసూళ్లను నిజం చేసే ఆడియో టేపులు మంగళవారం బహిర్గతం అయ్యాయి.
ఆడియో టేపుల్లో లైసెన్స్‌లకు సంబంధించి వ్యాపారులతో సాగించిన బేరసారాలు, వ్యాపారులు, నరహరి మధ్య సాగిన సంభాషణ మొత్తం ఆడియో టేపుల రూపంలో వెలుగులోకి వచ్చాయి. నరహరి తనదైన శైలిలో సీఎం చంద్రబాబు మొదలుకొని మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు, చివరకు విలేకర్లను కూడా విమర్శించటంతో పాటు దూషణల పర్వం కొనసాగించారు. మార్కెట్ యార్డులో ఒక స్థాయి అధికారి మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరిని తనదైన శైలిలో విమర్శిస్తూ ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా లెక్క చెప్పాడు.
విలేకర్లను బిచ్చగాళ్లతో పోలుస్తూ..
‘మనం చేసే డీల్‌లో విలేకర్లకు కూడా డబ్బులు ఇస్తే సరిపోతుంది. ముందుగానే వారితో మాట్లాడుకొని డబ్బులు ఇస్తే తలనొప్పి ఉండదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే వీళ్లు రాసే వార్తలకు యార్డు చైర్మన్, మనం పెట్టే ఫైల్స్‌పై సంతకాలు పెట్టే మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ ఇబ్బందిపెడతారు. ముందు వాళ్లను సెట్ చేసి రేటు మాట్లాడండి. వీళ్లంతా బిచ్చగాళ్ల లాంటి వాళ్లు. కొద్దిగా పడేస్తే పోతుంది.’ అని వ్యాఖ్యలు చేశాడు.
మార్కెటింగ్ శాఖలో కలకలం
మార్కెటింగ్ శాఖ, మార్కెట్ యార్డులో నరహరి ఆడియో టేపులు తీవ్ర కలకలం రేపాయి. మార్కెటింగ్ శాఖ అధికారి ఇస్సార్ అహ్మద్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఓఎస్‌డీ, ఇతర అధికారులకు మామూళ్లలో ఎవరికి ఎంత ఇవ్వాలో సమగ్రంగా లెక్కలు చెప్పాడు. దీంతో శాఖలో ఆడియో టేపులు హాట్æటాపిక్‌గా మారి అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. మరోవైపు మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని కమిషనర్, మంత్రి దష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.