పాపం పసివాళ్లు
మెదక్: బేల చూపులు చూస్తూ దీనంగా కూర్చున్న ఈ చిన్నారులు.. విధి ఆడిన వింత నాటకంలో అనాథలయ్యారు. అమ్మానాన్న పదాలు కూడా సరిగా పలకలేని వయసులోనే తల్లిదండ్రులు దూరమయ్యారు. అసలే నిరుపేదలు.. ఆపై వృద్ధులైన తాతయ్య, నానమ్మలే వీరికి దిక్కు.. జిన్నారం మండలం దోమడుగు గ్రామానికి చెందిన ఉమా, శంకర్‌లకు మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయస్సున్న యశ్వంత్, 9 నెలల సాత్విక సంతానం. సాత్విక పుట్టిన నెలకే తల్లి ఉమ అనారోగ్యంతో మృతి చెందింది.
అప్పటినుంచి ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా తండ్రి చూసుకునే వారు. భార్య మృతి చెందిందనే బాధతో తీవ్ర మనస్తాపానికి గురై మూడు రోజుల క్రితం శంకర్ కూడా మృతి చెందాడు. తాతయ్య, నాన్నమ్మ వృద్ధాప్యం.. పేదరికం కారణంగా వీరి ఆలనపాలన చూసుకోలేకపోవడంతో స్థానికులే ఆదుకుంటున్నారు. ఆపన్న హస్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.