బీచ్‌లో గల్లంతై యువకుడు మృతి
Published Fri, Sep 9 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
నరసాపురంరూరల్ : సరదాగా సముద్ర స్నానానికి వచ్చిన ఆ యువకుడు గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన నరసాపురం మండలం వేములదీవి చినమైనవానిలంకలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన కమ్మ వినీత్(23) మరో ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం పాలకొల్లులో జరిగే ఒక పెళ్లికి బయలుదేరాడు. వీరంతా భీమవరంలో రైలు దిగారు. పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో ఆటోలో నరసాపురం మండలం వేములదీవి చినమైనవానిలంక బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. చాలాసేపు ఉల్లాసంగా గడిపారు. వినీత్ సముద్రం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో అలల ఉధృతికి గల్లంతయ్యాడు. కళ్లముందే వినీత్ నీళ్లల్లో కొట్టుకుపోవడంతో స్నేహితులంతా ఖిన్నులైపోయారు. ఈహఠాత్పరిణామం నుంచి తేరుకుని వినీత్‌ను రక్షించేందుకు వారు చేసిన యత్నాలు ఫలించలేదు. విషయం తెలుసుకున్న వేములదీవి ఎంపీటీసీ సభ్యుడు మైల వసంతరావు స్పందించి గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు వినీత్ మృతదేహం లభ్యమైంది. స్నేహితులిచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీనివాసు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement