కాపాడబోయి..కాటికి | two men dead in beach bath | Sakshi
Sakshi News home page

కాపాడబోయి..కాటికి

Published Thu, Feb 15 2018 10:40 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

two men dead in beach bath - Sakshi

విమ్స్‌ ఆస్పత్రిలో శివరాం ప్రసాద్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

వారంతా ఆరిలోవలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందినవారు.. శివరాత్రి జాగారం అనంతరం బుధవారం ఉదయం సముద్ర స్నానానికి కుటుంబాలతో జోడుగుళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు.అక్కడ పిల్లలు ఆడుతున్న బంతి నీళ్లలోకి వెళ్లింది.దానికోసం యశ్వంత్‌ అనే చిన్నారి సముద్రంలోకి వెళ్లాడు. అది గమనించిన తండ్రి వెంకటశివరామ్‌ప్రసాద్‌ సముద్రంలోకి వెళ్లి కొడుకును ఒడ్డుకు చేర్చాడు. కానీ అతన్ని మాత్రం కెరటాలు తమలోకి లాక్కున్నాయి. దాంతో స్నేహితుడి కోసం రమణ నీళ్లలోకి దూకగా.. అతన్నీ కెరటాలు కబళించాయి.  రెండు కుటుంబాల్లో ఈ దుర్ఘటన అంతులేని విషాదం నింపింది.

ఆరిలోవ(విశాఖ తూర్పు): రోజంతా శివరాత్రి జరుపుకొన్నారు. జాగారంతో శివపూజలు చేశారు. మరుసటిరోజు పుణ్యస్నానాలకు బీచ్‌కు వెళ్లారు. తీరంలో రాకాసి కెరటం కొడుకుని కాటేసేందుకు దూసుకురావడంతో రక్షించేందుకు ఓ తండ్రి సముద్రంలోకి ముందుకు దూకాడు. ఇదంతా గమనిస్తున్న మరో వ్యక్తి తన స్నేహితుడిని రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ రాకాసి కెరటానికి బలైపోయారు. దీంతో రెండు కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. పెద్ద దిక్కును కోల్పోయి ఎలా బతకాలని బోరున విలపిస్తున్నాయి. ఈ హృదయవిదారకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో వార్డు పరిధి డెయిరీఫారం దరి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన దువ్వి వెంకట శివరాంప్రసాద్‌(48), కిర్లంపల్లి రమణ(45) కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి బుధవారం ఉదయం 10 గంటలకు జోడుగుళ్లుపాలెం బీచ్‌కు సముద్ర స్నానాలకు వెళ్లారు.

పెద్దలంతా ఒకవైపు స్నానం చేస్తుండగా పక్కనే వారి కుటుంబాలలోని పిల్లలంతా కలిసి నీటిలో బంతితో ఆడుతున్నారు.  బంతి లోపలకు వెళ్లిపోవడంతో దాన్ని తీసుకురావడానికి యశ్వంత్‌ అనే కుర్రాడు వెళ్లాడు. వెనుక నుంచి ఉధృతంగా వస్తున్న అలలను యశ్వంత్‌ గమనించలేదు. వాటిని గమనించిన వెంకట శివరాంప్రసాద్‌ తన కుమారుడు ప్రమాదానికి గురికాకుండా రక్షించాలని ముందుకు దూకాడు. అదే సమయంలో దూసుకొచ్చిన పెద్ద కెరటంలో తండ్రీ కొడుకు చిక్కుకుపోయారు. దీంతో కుమారుడిని ఒడ్డుకు నెట్టేసిన శివరాంప్రసాద్‌ అలతో పాటు లోపలకు కొట్టుకుపోయాడు. యశ్వంత్‌ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. ఇదంతా గమనిస్తున్న కిర్లంపల్లి రమణ తన స్నేహితుడు శివరాంప్రసాద్‌ను రక్షించాలని లోపలకు వెళ్లి అదే అలకు కొట్టుకుపోయాడు. వారిద్దరూ అలల్లో చిక్కుకుపోయిన విషయాన్ని గమనించిన లైఫ్‌గార్డులు, గజ ఈతగాళ్లు వారిద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారిద్దరూ కడుపునిండా సముద్రం నీళ్లు తాగేశారు. అందుబాటులో ఉన్న 108 వాహçనం సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అప్పటికే వెంకట శివరాంప్రసాద్‌ మృతి చెందాడని వారు నిర్థారించారు. కొన ఊపిరితో ఉన్న రమణను హెల్త్‌సిటీలో పినాకిల్‌ ఆస్పతికి తరలించారు. అక్కడ వైద్యం చేసిన కొంతసేపటికి రమణ మరణించాడు.

రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం  
సముద్ర స్నానంలో మృతి చెందిన ఇద్దరూ వారి కుటుంబాలకు పెద్ద దిక్కు. వారే ఆయా కుటుంబాలను పోషిస్తున్నారు. వెంకట శివరాంప్రసాద్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. కిర్లంపల్లి రమణకు భార్య నూకరత్నం, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివరాంప్రసాద్‌ ఇందిరాగాంధీనగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, రమణ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిద్దరి అకాల మరణంతో ఆయా కుటుంబాలు దిక్కులేనివిగా మిగిలాయి. కుటుంబ భారాన్ని ఎలా మోయాలంటూ ఆయా కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఇందిరాగాంధీనగర్‌ కాలనీ విషాదంలో మునిగిపోయింది. అందరితో సరగాదా గడిపే వారిద్దరూ ఒకేసారి కనుమరుగయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరి ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లినా...
వెంకట శివరాంప్రసాద్‌కు ఊపిరి ఆడుతున్నట్లు గమనించిన బంధువులు వెంటనే ఆటోలో విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే విమ్స్‌కు చేరేలోగా అతను మరణించాడని అక్కడి వైద్యులు తెలపడంతో బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. 108 సిబ్బంది సరిగా పరిశీలించకుండా ఊపిరి ఉండగానే మరణించాడని నిర్లక్ష్యం చేశారని విమ్స్‌ వద్ద మృతుని బంధువులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే ఆయన ప్రాణాలు మిగిలేవని, 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆయన ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. మృతదేహాలను ఆరిలోవ పోలీసులు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement